శారద పీఠం భూముల వ్యవహారంలో ట్విస్ట్, వైసీపీకి ఎఫెక్ట్ !!
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్ కు రాజగురువుగా పలువురు బావించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో శారదా పీఠానికి మేలు చేకూర్చేలా వ్యవహరించారని, వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం రూ. 15 లక్షలకే 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి అప్పగించిందని వెలుగు చూడటంతో ఆ విషయంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి వివరాలను బయటకు లాగుతోంది.
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్ కు ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖ జిల్లాలోని భీమిలి సమీపంలో వేద విద్యాలయం ఏర్పాటు చెయ్యడానికి భూమి కేటాయించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మనవి చేసింది. గురువు అడిగిన వెంటనే అప్పటి సీఎం జగన్ శారదా పీఠానికి భూమి ఇవ్వడానికి అంగీకరించారు.
భీమిలి మండలంలోని కొత్తవలసలో ఎకరం భూమి బహిరంగ మార్కెట్ లో సుమారు రూ 15 కోట్లు ఉందని స్థానికులు అంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం శారద పీఠంపై ప్రేమతో ఎకరం భూమి రూ 1 లక్షకు ఇవ్వడానికి అంగీకరించింది. రెండు సర్వే నెంబర్లలోని 15 ఎకరాల భూమిని కేవలం రూ 15 లక్షలకు శారదా పీఠానికి అప్పగించారు. శారదా పీఠానికి అప్పగించిన భూమి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 225 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
రూ. 225 కోట్ల విలువైన భూమిని కేవలం రూ 15 లక్షలకు శారదా పీఠానికి అప్పగించడంతో ఆ సమయంలో జగన్ ప్రభుత్వంపై అనేక మంది విమర్శలు చేశారు. గురుభక్తి చాటుకోవాలంటే ప్రభుత్వ భూములు దానం చెయ్యాల్సిన అవసరం లేదని విశాఖకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అప్పటి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదే సందర్బంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ఎదురు దాడికిదిగడంతో మాటల యుద్దం జరిగింది.
వేద విద్యాలయం కోసం తీసుకున్న భూములను వాణిజ్య అవసరాలు, రెవెన్యూ, నివాస అవసరాల కోసం ఉపయోగించుకునేలా మార్పులు చెయ్యాలని శారదా పీఠం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ దెబ్బతో గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు అంత తక్కువ ధరకు శారదా పీఠానికి వందల కోట్ల విలువైన భూములు అప్పగించింది అంటూ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శారదా పీఠానికి సుమారు రూ. 22 కోట్లకు భూమి కేటాయించవచ్చు అని అప్పట్లో అధికారులు నివేదిక ఇచ్చినా జగన్ ప్రభుత్వం మాత్రం ఆ నివేదిక పట్టించుకోకుండా కేవలం రూ 15 లక్షలకు 15 ఎకరాల భూమి ఇచ్చేసిందని వెలుగు చూడటంతో ఇప్పుడు ఆ భూముల వ్యవహారంపై విచారణ జరుగుతోంది.
Oct 12 2024, 19:37