హరియాణా ఓట్ల లెక్కింపు.. నుహ్‌లో కాంగ్రెస్ విజయం
జమ్మూ కాశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆప్, బీఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ 46. కానీ, హరియాణాలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నెలకుంది.
గతేడాది మత ఘర్షణలతో వార్తల్లో నిలిచిన హరియాణాలోని నుహ్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్ధి అఫ్తాబ్ అహమ్మద్ ఘన విజయం సాధించారు. ఐఎన్ఎల్డీ అభ్యర్ధిని ఆయన దాదాపు 47 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఇక్కడ, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతోంది. మొత్తం 90 స్థానాలలకు గానూ ఆ కూటమి 7 స్థానాల్లో విజయం సాధించి.. మరో 43 చోట్ల ఆధిక్యంలో ఉంది. పదేళ్ల తర్వాత, ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. కశ్మీర్ లోయలో ఎన్సీ తన పట్టును నిలుపుకుని.. జమ్మూ ప్రాంతంలోనూ సత్తా చాటింది. జమ్మూలో ఎక్కువ స్థానాలు దక్కుతాయని బీజేపీ వేసుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయి.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితలు వెలువడ్డాయి. బీజేపీకి ఓటమి తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. కానీ, వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ గెలుపు ముంగిట బోర్లాపడింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకుకోవడంలో విఫలమైంది. తాజా విజయంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. జాట్‌లు వ్యతిరేకతను అధిగమించి గెలుపు బావుటా ఎగురువేసింది. మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు.
హరియాణాలోని జింద్ నుంచి బీజేపీ అభ్యర్ధి డాక్టర్ కృష్ణలాల్ మిధ్దా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి మహావీర్ గుప్తాపై ఆయన 15860 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు, ఓట్ల లెక్కింపు జాప్యంపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే లెక్కింపు జాప్యం చేశారని ఆరోపించింది. అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుందని మండిపడింది. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేసింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ విజయం సాధించారు. జులానా నియోజకవర్గం నుంచి ఆమె తన సమీప ప్రత్యర్ధి బీజేపీ అబ్యర్ధి యోగేశ్ కుమార్‌ను 6,015 ఓట్ల తేడాతో ఓడించారు. తొలి రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న ఆమె తర్వాత వెనుకబడ్డారు. చివరి రౌండ్లలో మళ్లీ ముందంజలోకి వచ్చి.. విజయాన్ని అందుకున్నారు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్ల చేపట్టిన ఆందోళనకు వినేశ్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక, పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరినా.. 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందని అనర్హురాాలిగా ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్‌లోని ఒసోహ్లి స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధి దర్శన్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధిపై ఆయన 16 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన నజీర్ అహ్మద్ ఖాన్.. గురేజ్‌లో 1,132 ఓట్ల విజయాన్ని అందుకున్నారు. కథువాలో బీజేపీ అభ్యర్ధి డాక్టర్ భరత్ భూషణ్ ముందంజలో ఉన్నారు. కశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి 36 శాతం, బీజేపీ 26 శాతం, ఇతరులు 29 శాతం ఓట్లు సాధించారు.
హరియాణా ఎన్నికల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 10 నుంచి 12 రౌండ్ల లెక్కింపు పూర్తయితే అధికారిక వెబ్‌సైట్‌లో ఈసీ 4, 5 రౌండ్లే అప్‌డేట్ చేసిందని, దీనిపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇది అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చే ఎత్తుగడ అని ఆయన మండిపడ్డారు. తమ ప్రశ్నలకు ఈసీ సమాధానం చెబుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
2019 ఎన్నికల్లో పది స్థానాల్లో విజయం సాధించి, కింగ్ మేకర్‌గా అవతరించిన జననాయక్ జనతా పార్టీ.. ప్రస్తుతం మాత్రం చతికిలబడింది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ ఆదిక్యం చూపలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఉచ్నానాకలాన్ స్థానంలో... ఆరో స్థానంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. కనీసం జేజేపీకి డిపాజిట్ కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతోంది. జులానాలో వెనుబడిన కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక్యంలోకి వచ్చారు. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి ఆమె.. బీజేపీ అభ్యర్ధి యోగేశ్ కుమార్‌పై 2 వేలకుపైగా ఓట్ల లీడ్‌లో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ ఫోగట్ మళ్లీ తిరిగొచ్చారు.
జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా నౌషేరా స్థానంలో వెనుబడ్డారు. ఆయనపై నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురేంద్ర కుమార్ చౌదురి 11 వేల ఓట్లకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికి బయటకొచ్చిన సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్.. సొంతంగా పార్టీ పెట్టి జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో పోటీచేసి చేదు ఫలితాలను ఎదుర్కొన్నారు. ఆయన పార్టీ డెమొక్రాటిక్ ప్రోగెస్ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ కశ్మీర్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ ఓటమి చవిచూశారు. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ నుంచి శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీచేసిన ఆమె.. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి బషీర్ అహ్మద్ షా వీర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఇల్తీజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు, కాంగ్రెస్ కూటమి అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.
జమ్మూ కశ్మీర్, హరియాణాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కనీసం ప్రభావం చూపలేకపోయింది. రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. హరియాణాలో కాంగ్రెస్‌తో కలిసి పోటీపై చివరి నిమిషంలో వైదొలగిన ఆ పార్టీ.. అక్కడ బొక్కబోర్లా పడింది. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. దాని ప్రభావం కనిపించలేదు. ఇక, జమ్మూ కశ్మీర్‌లోనూ అదే పరిస్థితి. రెండు చోట్ల బొక్కబోర్లా పడింది.
కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం దిశగా సాగుతోంది. ఇండియా కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్సీ 40 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికలు కావడంతో ఫలితాలపై ఆసక్తి నెలకుంది. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిసి సభ్యుల సంఖ్య 95కు చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 48.
హరియాణా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యేలా ఉంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, ఫలితాలు మాత్రం అందకు విరుద్దంగా వెలువడుతున్నాయి. అంచనాల భిన్నంగా భీజేపీ ఆధిక్యంలో వచ్చింది. హరియాణాలో వరుసగా ఏ పార్టీ మూడోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని బీజేపీ అధిగమించే అవకాశాలు ఉన్నాయి. గత పదేళ్లలో తాము చేసిన అభివృద్ధే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. తొలి రౌండ్లలో కాంగ్రెస్ భారీ ఆధిక్యం చూపగా.. ప్రస్తుతం బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. దీంతో విజయం ఎవర్ని వరిస్తుందోనని ఆసక్తి రేపుతుంది. ఇక, జులానాలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకబడ్డారు. ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి ఆమె 1200 ఓట్ల వెనుబడి ఉన్నారు. హిస్సార్ నుంచి బరిలో నిలిచిన బీజేపీ రెబల్ సావిత్రి జిందాల్.. కాంగ్రెస్ అభ్యర్ధిపై 3 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈ కూటమి మ్యాజిక్ మార్క్‌ను దాటింది. ఇక, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ రెండు చోట్ల ఆధిక్యంలో ఉండగా... ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ మాత్రం వెనుకబడ్డారు. ఆమెపై ఎన్సీ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. పుల్వామాలో పీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉంది. కేవలం నాలుగు స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. 1999 తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఆ పార్టీ అత్యంత దారుణమైన పరాజయాన్ని చవిచూస్తోంది.
హరియాణాలో ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత భారీ ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం వెనుకంజ వేసింది. అనూహ్యంగా బీజేపీ మందంజలోకి వచ్చింది. ఇప్పటి వరకు వెల్లడైన ట్రండ్స్ బట్టి బీజేపీ 48, కాంగ్రస్ 37, ఐఎన్ఎల్డీ 3 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. హరియాణాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. నిమిష నిమిషానికి ట్రెండ్ మారుతోంది. దీంతో హరియాణా ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి సత్తాచాటేలా ఉంది. ఇప్పటి వరకూ వెలువడిన జమ్మూ కాశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాల సరళిని బట్టి రెండు చోట్ల ఇండియా కూటమి ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద సంబరాలు మొదలయ్యాయి. హరియాణాలో ఆ పార్టీ బంపర్ విక్టరీ కొట్టే దిశగా వెళ్తోంది.
జమ్మూ కాశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు గానూ 50 చోట్ల కాంగ్రెస్-ఎన్సీ కూటమి, 30 చోట్ల బీజేపీ, 6 చోట్ల పీడీపీ ఉన్నాయి. ఇక, హరియాణాలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం పార్టీ సాగుతోంది. అధికార బీజేీపీకి మింగుడపడని ఫలితాలు వెలువడుతున్నాయి.
కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తాను పోటీచేసిన రెండు చోట్లా ఆదిక్యంలో ఉన్నారు. గందెర్‌బల్, బుద్గాంలో ఆయన ముందంజలో ఉన్నారు. నౌషిరాా స్థానంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్సుడు రవీందర్ రైనా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హరియాణాలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాలు బట్టి కాంగ్రెస్ పార్టీ 60కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గర్హి-సంప్లాయ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, జులానాలో వినేశ్ ఫోగట్ లీడ్‌లో ఉండగా.. హరియాణా సీఎం నాయిబ్ సింగ్ షైనీ తాను పోటీచేసిన ల్వాడ్వా స్ఘానంలో ముందంజలో ఉన్నారు.
⍟ జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైయ్యింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో రెండు చోట్ల కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. హరియాణాలో కాంగ్రెస్ 40 స్థానాలు, బీజేపీ 16, ఇతరుల రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హరియాణాలోని జూలానాలో రెజ్లర్ వినేశా ఫోగట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి 34, బీజేపీ 25, పీడీపీ 4, ఇతరులు 6 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఫలితాలను సరళిని బట్టి హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను తెరిచి లెక్కింపు చేపడతారు. తొలి రౌండ్ ఫలితం 9 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్‌లో 28 కేంద్రాల్లోనూ, హరియాణాలో 93 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు స్పష్టత రానుంది. ఇక, ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే హరియాణాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నాయకులు ముందుగానే సంబరాలు చేసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే మొత్తం 95 కు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 48.
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించగా.. ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడనున్నాయి. పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2014లో చివరిసారిగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరగ్గా.. ఐదేళ్ల తర్వాత 2019లో జరగాల్సి ఉండగా ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తదితర పరిణామాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు సెప్టెంబరు 30 లోగా ఎన్నికలు జరిపించాల్సిందేనని ఆదేశించింది. దీంతో నియోజకవర్గా పునర్‌విభజన పూర్తిచేసి ఎన్నికలను నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీపడగా.. ప్రధాన పోటీ కాంగ్రెస్-ఎన్సీ కూటమి, పీడీపీ, బీజేపీల మధ్యే సాగింది. పునర్‌విభజనతో జమ్మూ ప్రాంతంలో సీట్లు పెరగడం బీజేపీకి లాభిస్తుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బీజేపీకి అనుకూలంగా ఉంది.
ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రమైన హరియాణాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. అక్టోబరు 5 ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 1071 మంది బరిలో నిలిచారు. ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని కమలం పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, తమదే గెలుపని, బీజేపీని హరియాణా ప్రజలు ఇంటికి సాగనంపుతారని కాంగ్రెస్ చెబుతోంది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఆ పార్టీకే మొగ్గు ఉందని అంటున్నాయి. దీంతో హస్తం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది.
పదేళ్ల నుంచి అధికారంలో ఉండటంలో సాధారణంగా అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమించింది. గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను ఆకర్షించడంతోపాటు, జాట్‌యేతర, దళిత ఓటర్లను సంఘటితం చేసేందుకు ప్రయత్నాలు చేసింది. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిచ్చాయే కాసేపట్లో తేలిపోనుంది. హరియాణాలో కుల సమీకరణాలు, పార్టీల విభేదాలు ప్రధానాంశంగా మారాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 10 స్థానాలకు గానూ ఐదింటితోనే సరిపెట్టుకుంది.
ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రతను ఏర్పాటుచేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరిచి, లెక్కింపు చేపడతారు. మూడు నాలుగు గంటల్లో ఎవరికి మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ అధికారం చేపడుతుంది? హంగ్ వస్తుందా? అనేది స్పష్టత వస్తుంది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతుండగా.. నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించదని, హంగ్ ఏర్పడవచ్చనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటులో ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. వీరిని నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తం 90 స్థానాలున్న హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీ 46. ఈ సంఖ్యను చేరుకునే పార్టీ అధికారం చేపడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోన్న బీజేపీకి ఈసారి హరియాణాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జాట్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు దూరం కావడంతో ఆ పార్టీ ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టింది.
Oct 10 2024, 11:23