ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్.. 10 రోజుల తర్వాత మృతదేహం లభ్యం
ఏపీలోని ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణ కుమారి (62) కిడ్నాప్ కథ విషాదాంతమైంది. గత నెల 29వ తేదీన కిడ్నాప్‌నకు గురైన ఆమె మృతదేహం తాజాగా బయటపడింది. ఎదురింట్లో ఉండే వెంకటేశ్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడని.. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో ఏపీలోని శాంతి భద్రతలపై ఆందోళన మొదలైంది.
ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి మదనపల్లె శివారులోని వైఎస్ జగన్ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు తన ఎదురింట్లో ఉంటున్న వెంకటేశ్‌తో కలిసి బైక్‌పై పుంగనూరు రోడ్డులో ఉన్న స్వామి వద్దకు మంత్రించుకోవడానికి వెళ్లింది. ఇదే అదనుగా స్వర్ణకుమారిని వెంకటేశ్ కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత హత్య చేశాడు. మదనపల్లి టూటౌన్ పరిధిలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. అయితే అదే సమయంలో స్వర్ణకుమారి స్నేహితురాలు ఫోన్ చేసింది. కానీ కాల్ ఫార్వర్డ్ అనే వాయిస్ వినిపించింది. ఆ రోజు సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. దీంతో దైవభక్తి ఎక్కువగా ఉండటంతో ఏదైనా దూర ప్రాంతంలోని గుడికి వెళ్లి ఉంటుందని భావించింది.
కానీ అక్టోబర్ 1వ తేదీన పింఛన్ తీసుకునేందుకు కూడా రాకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు తెలిపారు. దీంతో మదనపల్లెకు వచ్చిన సీఐ.. తన తల్లి ఆచూకీ కోసం చుట్టుపక్కల మొత్తం విచారించాడు. ఎక్కడ ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో మదనపల్లె టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు విచారణ మొదలుపెట్టిన పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను బెంగళూరులో సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.
సీఐ తల్లి కిడ్నాప్, హత్య నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో ఈ అరాచకం ఏంటి చంద్రబాబూ అని ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వంలో పోలీసు కుటుంబాలకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీసింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గప్పాలు కొట్టడం కాదు.. శాంతి భద్రతలను ఎలా రక్షించాలో ఫస్ట్ తెలుసుకో అని హితవు పలికింది.
ఏపీలో సీఐ ఫ్యామిలీకే రక్షణ లేదంటే ఇది మీ చేతగానితనం కాదా అని ఏపీ సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించింది.
Oct 08 2024, 12:54