అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్, బీజేపీలకు అగ్ని పరీక్ష
జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆప్, బీఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 90 చొప్పున సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ 46. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఎవరు అందుకుంటారో కొద్ది గంటల్లో తేలిపోనుంది.
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించగా.. ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడనున్నాయి. పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2014లో చివరిసారిగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరగ్గా.. ఐదేళ్ల తర్వాత 2019లో జరగాల్సి ఉండగా ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం తదితర పరిణామాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు సెప్టెంబరు 30 లోగా ఎన్నికలు జరిపించాల్సిందేనని ఆదేశించింది.
దీంతో నియోజకవర్గా పునర్‌విభజన పూర్తిచేసి ఎన్నికలను నిర్వహించారు. మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీపడగా.. ప్రధాన పోటీ కాంగ్రెస్-ఎన్సీ కూటమి, పీడీపీ, బీజేపీల మధ్యే సాగింది. పునర్‌విభజనతో జమ్మూ ప్రాంతంలో సీట్లు పెరగడం బీజేపీకి లాభిస్తుందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బీజేపీకి అనుకూలంగా ఉంది.
ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రమైన హరియాణాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. అక్టోబరు 5 ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని కమలం పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే, తమదే గెలుపని, బీజేపీని హరియాణా ప్రజలు ఇంటికి సాగనంపుతారని కాంగ్రెస్ చెబుతోంది. ఇక, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఆ పార్టీకే మొగ్గు ఉందని అంటున్నాయి. దీంతో హస్తం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది.
పదేళ్ల నుంచి అధికారంలో ఉండటంలో సాధారణంగా అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమించింది. గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను ఆకర్షించడంతోపాటు, జాట్‌యేతర, దళిత ఓటర్లను సంఘటితం చేసేందుకు ప్రయత్నాలు చేసింది. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిచ్చాయే కాసేపట్లో తేలిపోనుంది. హరియాణాలో కుల సమీకరణాలు, పార్టీల విభేదాలు ప్రధానాంశంగా మారాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 10 స్థానాలకు గానూ ఐదింటితోనే సరిపెట్టుకుంది.
Oct 08 2024, 12:50