కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.
.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం పని చేస్తోంది. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో మాట్లాడారు. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకుందని చెప్పారు.
మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రలతో భేటీ అవుతున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణకు వరద సాయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. నమామీ గంగకు నిధులు కేటాయించినట్లుగానే రాష్ట్రంలోని మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పలు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్ల సహాయం ప్రకటించగా.. తెలంగాణ మాత్రం రూ.416.80 కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో వరదలతో చాలా నష్టపోయిందని రేవంత్ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రె అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై వార్తలు వస్తుండడంతో రేవంత్ పార్టీ పెద్దలతో ఇందుకు సంబంధించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సోమవారం రాత్రికి లేదా.. మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.
Oct 07 2024, 20:36