తెలంగాణా రైతుల రుణమాఫీపై షాకింగ్ లెక్కలు!
రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని అవలంబిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతాంగంతో పాటు యావత్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ ను ఇరకాటంలో పెట్టేలా రుణమాఫీపై షాకింగ్ లెక్కలు చెప్పారు.
రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేసిన ప్రకటన మోసం
ఈ బహిరంగ లేఖలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఆ హామీని నిలబెట్టుకోలేదని హరీష్ రావు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కానీ రాష్ట్రంలో రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని హరీష్ రావు వెల్లడించారు.
రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ చేసింది ఇదే
రుణమాఫీ పూర్తి చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్న హరీష్ రావు సెప్టెంబర్ 25వ తేదీన ఆర్టిఐ దరఖాస్తుకు ఎస్బిఐ ఇచ్చిన సమాచారంతో రుణమాఫీ పూర్తిగా కాలేదని తేలిపోయిందని స్పష్టం చేశారు. లక్ష నుంచి 1.5 లక్షల మధ్య రుణం తీసుకున్న రైతుల సంఖ్య రెండు లక్షల 62,341 కాగా ఇప్పటివరకు లక్ష 30 వేలు 915 మంది రైతులకు రుణమాఫీ అయిందని పేర్కొన్నారు.
లెక్కలతో బయటపెట్టిన హరీష్ రావు
ఇక లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5 లక్షల 74,137 కాగా, 2 లక్షల 99 వేల 445 మంది రైతులకు రుణమాఫీ అయిందని మిగతా వారికి కాలేదన్నారు. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య రాష్ట్రంలో 1,65,67 మంది కాగా ఇప్పటివరకు 65,231 మందికి రైతు రుణమాఫీ పూర్తయినట్టు ఎస్బిఐ డేటా అందించిందని హరీష్ రావు పేర్కొన్నారు.
రుణ మాఫీపై బహిరంగ లేఖ రాసిన హరీష్ రావు
మొత్తంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని రైతులను పక్కా మోసం చేసిందని హరీష్ రావు ఆధారాలతో సహా బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, తెలంగాణనే కాదు భారతదేశాన్ని కూడా మోసం చేసిందని హరీష్ రావు వెల్లడించారు. రుణమాఫీ అమలు చేయకుండానే అమలు చేసినట్టు ఫోజులు కొట్టడం దుర్మార్గమని రైతు రుణమాఫీనే శుద్ధ అబద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Oct 07 2024, 16:13