ఏపీ ఎన్నికల ఫలితాలపై మరో బాంబు పేల్చిన ఆరా మస్తాన్
వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని చెప్పిన వారిలో ఆరా సర్వే కూడా ఒకటి. గత 15 ఏళ్లుగా చేసిన సర్వేల్లో ఆరా చెప్పిన ఫలితాలే రావడంతో మెజార్టీ ప్రజలు ఆయన ఆ సంస్థ చెప్పిన ఫలితాలే వస్తాయని భావించారు.ఆరా సంస్థల అధినేత ఆరా మస్తాన్ చేసే సర్వేకు ఓ నిబద్ధత ఉంటుంది. ఆయన చేసిన సర్వే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. ఏపీలో వైసీపీ 110 సీట్లను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. తన సర్వే నిజం అవుతుందని.. మరోసారి జగనే సీఎం అని ఆయన బల్ల గుద్ది మరి చెప్పడం జరిగింది.
ఆరా మస్తాన్ సర్వే తర్వాత వైసీపీ అనుకూలంగా భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరిగాయి. కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది.కూటమి ఏకంగా 164 సీట్లతో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆరా మస్తాన్ జగన్‌ను గుడ్డిగా నమ్మడంతోనే అతి విశ్వాసానికి వెళ్లాడని విమర్శలొచ్చాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత ఆరా మస్తాన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన వంద రోజుల పూర్తయిన తర్వాత మరోసారి మస్తాన్ యాక్టివ్ అయ్యారు.దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ మరోసారి రాజకీయ చర్చ జరిపేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా మస్తాన్ స్పందించారు.పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20ని అధికారిక వెబ్ సైట్‌లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత 48 గంటల్లోనే ఈ ఫామ్ అధికారిక వెబ్ సైట్‌లో ఉంచాలని మస్తాన్ తెలిపారు. కానీ వంద రోజులు పూర్తయిన తర్వత దాన్ని ఎందుకు అధికారికంగా అప్ లోడ్ చేశారని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆరా మస్తాన్ కోరుతున్నారు.అయితే ఎన్నికల తతంగం ముగిసిన 100 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫలితాల గురించి ఆరా మస్తాన్ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆరా మస్తాన్ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇస్తుందో లేదో చూడాలి.
Oct 07 2024, 16:09