వదంతులేం నమ్మొద్దు.. అంతా బాగానే ఉంది.. ఆ వార్తలపై రతన్ టాటా క్లారిటీ!
ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా సోమవారం రోజు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలొచ్చాయి. లో బీపీతో ఆస్పత్రిలో చేరారని.. ఐసీయూలో చేరారని పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే వార్తలు విస్తృతమవుతున్న తరుణంలోనే రతన్ టాటా ట్విట్టర్‌లో దీని గురించి స్పందించారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పారు.
తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై స్పందించారు టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని.. తాను బాగానే ఉన్నానని అన్నారు. బీపీ డౌన్ అయి ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ట్విట్టర్‌లో (x) పేర్కొన్నారు. ఇప్పటికీ తాను ఉత్సాహంగానే ఉన్నట్లు వివరించారు. అంతకుముందు.. తీవ్ర అనారోగ్యంతో.. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారని, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు మీడియాల్లో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే.. సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో స్వయంగా రతన్ టాటానే స్పందించాల్సి వచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వదంతులేనని ఖండించారు. తన ఆరోగ్యం గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు.
నా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు/ఊహాగానాల గురించి తెలిసింది. అందుకే నేను దీని గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. నా వయసు రీత్యా.. సాధారణ వైద్య చికిత్సల కోసమే ఆస్పత్రికి వెళ్లాను. ఇక్కడ ఆందోళన అవసరం లేదు. నేను ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్నా. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని.. ప్రజలు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.' అని రతన్ టాటా ట్వీట్ చేశారు.
Oct 07 2024, 13:45