ఏపీలో మరో 10 రూపాయల డాక్టర్-దసరా నుంచే..! ఎక్కడో తెలుసా
ఏపీలో ప్రస్తుతం ఏ చిన్న ఆస్పత్రికి వెళ్లినా ఔట్ పేషెంట్ (ఓపీ) సర్వీస్ కోసం కనీసం 500 సమర్పించుకోవాల్సిందే. ఆ తర్వాత పరీక్షలు, మందులు, సర్జరీలు కావాలంటే భారీ మొత్తం ఇచ్చుకోక తప్పదు. కానీ ఇంకా రాష్ట్రంలో పది రూపాయల డాక్టర్లు అక్కడక్కడా తమ సేవలు అందిస్తూనే ఉన్నారు. అంతే కాదు ఇదే కోవలో మరికొందరు పది రూపాయల డాక్టర్లు కూడా తమ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పులివెందులలో 10 రూపాయల డాక్టర్ గానే పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయవాడ నుంచి వెళ్లి కడపలో ఇదే పది రూపాయల కాన్పెప్ట్ తో నూరీ పరీ అనే మహిళా డాక్టర్ కూడా సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం 10 రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు చేస్తున్న డాక్టర్లు చాలా మందే ఉన్నారు. ఇదే కోవలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో మరో 10 రూపాయల డాక్టర్ సేవ చేసేందుకు సిద్దమవుతున్నారు.
ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్ ఎం. లక్ష్మీప్రియ తన సొంత గడ్డ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 10 రూపాయలకే ఔట్ పేషెంట్ సేవలు అందించేందుకు సిద్దమవుతున్నారు. ఈ దసరా నుంచే ఈ సత్ కార్యం మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.
జనరల్ కేసులు, పీడియాట్రిక్ కేసులు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్, దీర్ఘకాలిక సమస్యలకు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 8 వరకు డాక్టర్ లక్ష్మీప్రియ అందుబాటులో ఉండనున్నారు. నందిగామలో ప్రభుత్వ హాస్పిటల్ రోడ్ లోని యాదవుల బావి దగ్గర ఉన్న లత క్లినిక్స్, C/O అజయ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో ఈ పది రూపాయల డాక్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Oct 07 2024, 13:40