సెక్రటేరియట్ ఎఫ్‌టీఎల్‌లో ఉంటే లేని ఇబ్బంది.. పేదల ఇండ్లు ఉంటే ఏంటి?: అసదుద్దీన్ ఒవైసీ
హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.
హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది తొలగిస్తారా అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆఫీస్, సెక్రటేరియట్, ప్రముఖుల ఘాట్‌లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి.
వాటిని కూడా కూల్చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఎవ్వరు అడ్డొచ్చిన మూసీ సుందరీకరణ ఆగదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్‌లో నిర్వహించిన సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందని మర్చిపోవద్దని చెప్పారు.
సెక్రటేరియట్‌తో పాటు బాపు ఘాట్ ఇలా మరెన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర పరిపాలన విభాగం ఎఫ్‌టీఎల్‌లో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇండ్లు ఉంటే ఇబ్బంది ఏమిటని అని ప్రశ్నించారు. అభివృద్ధికి తాము మద్దతు ఇస్తామని, కానీ పేదలు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ప్రధాని మోడీ పాలనలో ముస్లిం మైనార్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ఆయన ప్రసంగాలు వినే ఉద్దేశం లేకనే తాను పార్లమెంటుకు వెళ్లలేదని చెప్పారు. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్క ముస్లిం ఎంపీ లేరని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కనుసన్నల్లో నడుస్తుందన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రిబుల్ తలాక్, సీఏఏ లాంటి చట్టాలు తెచ్చారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. మహారాష్ట్ర, కశ్మీర్, హర్యానాలో ఆ పార్టీ ఓటమి ఖాయమన్నారు.
Oct 07 2024, 13:06