రైల్వే నియామకాలపై కేంద్రం యూటర్న్-కీలక నిర్ణయాలు..!
2019 ఎన్నికలకు ముందు కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ తర్వాత ఐదేళ్లలో తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఒక్కొక్కటిగా వాటిపై సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా 2019 సమయంలో అమల్లోకి తెచ్చిన రైల్వే అధికారుల నియామకాల నిబంధనలపై యూటర్న్ తీసుకుంది. వీటి స్ధానంలో తిరిగి పాత విధానాన్నే అమలు చేయాలని రైల్వే బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ కింద ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణుల నియామకం కోసం యూపీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహిస్తుంది. వీటిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ఒకటి కాగా.. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) రెండవది. అయితే 2019లో ఇంజనీరింగ్ పరీక్షను తొలగించి కేవలం సీఎస్ఈ రాస్తే సరిపోతుందని నిబంధనలు సవరించింది. కొత్త విధానంలో రెండు రిక్రూట్ మెంట్లు కూడా నిర్వహించింది. అయితే ఇప్పటివరకూ వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తోడు ఏడాదికి ఐఆర్ఎంస్ కింద 150 మందినే తీసుకోవాలన్న మరో నిర్ణయం ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడింది. రైల్వేలో ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సాంకేతిక విభాగాల్లో అధికారుల కొరత ఏర్పడింది. దీంతో జూనియర్లనే ఈ పోస్టులకు ప్రమోట్ చేయడం లేదా సబార్డినేట్ ర్యాంక్ అధికారుల ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ వచ్చీ రాగానే వీటిపై దృష్టిసారించారు. పాత నిర్ణయాల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో మళ్లీ యథావిథిగా రిక్రూట్ మెంట్లు జరగబోతున్నాయి. కేంద్రం యూటర్న్ తర్వాత సివిల్ ఇంజినీరింగ్ (75), మెకానికల్ ఇంజినీరింగ్ (40), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (50), సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ (40), స్టోర్స్ (20) కేటగిరీల కింద 225 పోస్టులను ఐఆర్‌ఎంఎస్ కింద భర్తీ చేయాల్సి ఉంటుందని ఈ రిక్రూట్ మెంట్ కు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్రం టెలికాం శాఖ యూపీఎస్సీకి సమాచారం ఇచ్చింది.
Oct 07 2024, 12:20