జగన్ రాజకీయం!
విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది.
విద్యా రంగంలో గత ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ సంస్థల సిబ్బందిని ప్రభుత్వ సర్వీస్‌లో విలీనం చేయడం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వంలో కొనసాగుతున్న అధ్యాపకుల సర్వీస్‌కు సమానంగా ఎయిడెడ్ సిబ్బందిని కూడా విలీనం చేసేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందాన వ్యవహరించింది. గత ప్రభుత్వం ఎయిడెడ్, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రత్నప్రభ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది.
ఆ కమిటీ సూచనలతో, కొందరు అధికారుల సలహాలతో హడావుడిగా అనాలోచిత నిర్ణయం తీసేసుకొని ఎయిడెడ్‌లో పనిచేసే సిబ్బందిని రాత్రికి రాత్రే తక్షణం ప్రభుత్వ విద్యాసంస్థల్లో రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దాని పర్యవసానాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కళాశాలల్లో విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు, అలాగే విద్యాసంస్థల కార్యాలయాలలో పరిపాలనను నిర్వహించే అధ్యాపకేతర సిబ్బందిలో ప్రమోషన్ల కొరకు పోట్లాడుకొనే పరిస్థితి వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మంచి విద్యాబోధన కల్పించి, వారు ముందుకు సాగేలా చూడాల్సిన ఉన్నత విద్యారంగ సిబ్బంది, విద్యాసంస్థల్లో రాజకీయ వాతావరణాన్ని కల్పించి ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే పన్నాగాలకు నాంది పలికారు.
వాస్తవానికి ఎయిడెడ్ సిబ్బందికి గతంలో కూడా వేతనాలు ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తున్నా వారిమీద నియంత్రణ ప్రభుత్వం చేతిలో గాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేది. దీనిని అవకాశంగా తీసుకొన్న కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఉద్యోగాలను అమ్ముకోవడం, తమ సంస్థల్లో విద్యార్థుల అడ్మిషన్లను ఎక్కువ చూపి, వారికి వచ్చే ఉపకార వేతనాలు తమ స్వంత ఖాతాల్లోకి మళ్లించుకోవడం, దాతల ద్వారా వచ్చిన ఆస్తులను కమిటీల పేరుతో అమ్మేసుకోవడం వంటివి జరిగేవి.
వీటన్నింటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే స్వస్తి చెప్పే విధానానికి శ్రీకారం చుట్టి, ప్రైవేట్ ఎయిడెడ్ విద్యాసంస్థలను ఒక గాడిన పెట్టగలిగారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసి, వివిధ రకాలుగా విద్యాసంస్థల యాజమాన్యాన్ని భయపెట్టి, అందులో పనిచేసే సిబ్బందిని ఉన్నపళంగా ప్రభుత్వంలో విలీనం చేసి వారిని త్రిశంకుస్వర్గంలో నెట్టివేసింది. ఇప్పుడు కొంతమంది వారి అనుకూల సంఘాలలోని సిబ్బందితో ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దుపరచి, ఎయిడెడ్ విద్యాసంస్థలకు పూర్వవైభవం తీసుకురావాలని ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ సర్వీస్‌లోని ఎయిడెడ్ సిబ్బందిని వెనుకకు పంపాలంటే అనేక కోర్టు కేసులు, సర్వీస్ నిబంధనలు ఉంటాయి. గత ప్రభుత్వం ఎయిడెడ్‌లో రద్దు చేసిన సుమారు 2000 ఉద్యోగులను ప్రస్తుత ప్రభుత్వం తిరిగి ఎయిడెడ్‌కు కేటాయించినా, అక్కడ వారికి విద్యార్థులు లేక ఎటువంటి బోధనాపని లేకున్నా, వారిని కూర్చోబెట్టి వేతనాలను చెల్లించాలి. ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇరుకున పెట్టడమే. ఉన్నత విద్యా కార్యాలయం, కాలేజియేట్ కమిషనర్ కార్యాలయంలోని అధికారులు... ఇంకా గత వైసీపీ ప్రభుత్వానికి మేలు కలిగేలా చేసిన కొంతమంది ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే సిబ్బందిని రెచ్చగొట్టి, ఆందోళనలకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే విద్యారంగాన్ని గాడిని పెడుతున్నా, కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయాలు దీనికి మేలు కన్నా కీడు చేసే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో జరుగుతున్న పరిణామాల పట్ల నిఘా వుంచి, బడుగు బలహీన విద్యార్థులకు నాణ్యమైన, చక్కటి విద్యను ప్రభుత్వం అందించాలి.
Oct 05 2024, 12:32