లడ్డు కల్తీ తేల్చేది ఆ ఐదుగురే.. సుప్రీం కోర్టు సంచన నిర్ణయం ఎఫెక్ట్..
సుప్రీం కోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం దాకా వెళ్లింది. అసలు ప్రస్తుతం ఆరోపిస్తున్నట్లుగా తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే వ్యవహారాన్ని బయటపెట్టేందుకు న్యాయమూర్తుల బెంచ్ స్వతంత్ర సిట్‌ను ఏర్పాటుకు ఆదేశించింది. ఇది ఎటువంటి వివాదం లేకుండా నిజాలను బయటకు తెచ్చే అవకాశం కల్పిస్తుంది.
సుప్రీం కోర్టు ఆదేశించిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందంలో సీబీఐకి చెందిన ఇద్దరు అధికారులు, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నుంచి ఇద్దరు అధికారులతో పాటు ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారి ఉంటారు. దీనికి ముందు ఏపీ ప్రభుత్వం నెయ్యి కల్తీ వ్యవహారంలో నిజానిజాలు బయటపెట్టేందుకు సిట్ వేసింది. దీనిపై ప్రతిపక్షాలు విశ్వాసం లేదని ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టు సైతం ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నట్లు తీర్పును చూస్తే తెలుస్తోంది. దీనికి ముందు ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఓటీవీ ఎడిటర్, విక్రమ్‌సంపత్ అనే భక్తుడు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ విషయంపై స్పందిస్తూ సుప్రీం కోర్టు కేసును రాజకీయ సాధనంగా ఉపయోగించకుండా నిరోధించాలనే ఉద్దేశాన్ని నొక్కి చెప్పింది. అలాగే "కోర్టును రాజకీయ యుద్ధభూమిగా ఉపయోగించడాన్ని మేము అనుమతించము" ఇది తమకు ఇష్టం లేదని, పొలిటికల్ డ్రామాగా మారిపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సిట్ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి పర్యవేక్షించాలని సూచించారు.
దర్యాప్తుకు ఏర్పాటు చేయనున్న సిట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారికి కూడా చోటు కల్పించటంతో గతంలో వినియోగించిన నెయ్యిలో కల్తీలు జరిగాయా లేదా అనే విషయం బయటకు వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి ఇప్పటి వరకూ సేకరించిన దర్యాప్తు వివరాలను.. సుప్రీం కోర్టు ఏర్పాటు చేయమన్న స్వతంత్ర బృందం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే విషయాలు వేచి చూడాల్సిందే. అయితే స్వతంత్ర కమిటీలో ఎవరు ఉంటారనే నిర్ణయాన్ని సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర పోలీసు విభాగం నుంచి డీజీపీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నుంచి ఆ సంస్థ ఛైర్మన్ కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ధర్మాసనం కల్పించింది.
Oct 04 2024, 20:58