రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు..!
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని.. వీటి ప్రభావంతో వానలు పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని కామారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, సిద్దిపేట, నాగర్ కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని పలు చోట్లు భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కాకతీయ సొసైటీ, బోరబండ, మోతినగర్, ఎస్సాఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వాన పడింది.
మంగళవారం కామారెడ్డిలోని గాంధారిలో రాష్ట్రంలో అత్యధికంగా 9.73 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. సికింద్రాబాద్ పాటిగడ్డలో 4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వచ్చే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లా అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వాన పడే అవకాశం ఉందని పేర్కొంది.
భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. నాగార్జున సాగర్, పులిచింతల, జూరాల, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్ మానేరు తోపాటు అన్ని జలాశయాలు నిండిపోయాయి. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కీలకమైన రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రత్యేకంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లలో నిండు కుండలా మారాయి. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతోన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 34.4 నమోదు కాగా.. కనిష్ఠంగా 23.7 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది.
హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ లో తెలంగాణలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు అయింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో అధిక వర్షపాతం నమోదు అయింది. హైదరాబాద్ కూడా సాధారణం కన్నా ఎక్కవ వర్షపాతం పడినట్లు చెబుతున్నారు.
Oct 03 2024, 09:35