మొస్సాద్ హెడ్ క్వార్టర్ ధ్వంసం?
లెబనాన్‌లో ఇటీవలే సంభవించిన ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతం కావడానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది ఇరాన్. ఇజ్రాయెల్‌పై దండెత్తింది. శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది. రాజధాని టెల్ అవివ్, జెరూసలెం సహా అనేక ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. మొత్తం 181 మిస్సైళ్లను సంధించింది ఇరాన్.
హెజ్బొల్లాను దాదాపుగా నామరూపాల్లేకుండా చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించిందే అయినప్పటికీ- గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.
హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా మొన్నటికి మొన్న ఇజ్రాయెల్‌పై లెబనాన్ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. జెరూసలెం సహా తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరెన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ సైతం యుద్ధానికి దిగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని పేరు పెట్టింది. ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకమైన ఎఫ్- 35 ఫైటర్ జెట్స్ ఎయిర్ బేస్ సైతం ధ్వంసమైందని ప్రకటించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్‌కు దక్షిణ దిశగా ఉన్న టెల్ నాఫ్‌లో ఉంటుంది మొస్సాద్ ప్రధాన కార్యాలయం.
అలాగే- బీర్‌షేవా సిటీ సమీపంలో ఉండే నెవాటిమ్ ఎయిర్‌బేస్ సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. ఎఫ్- 35 ఫైటర్ జెట్స్‌కు ఆదే ప్రధాన కేంద్రం. తాజా దాడుల్లో ఈ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ మహ్మద్ బఘేరి తెలిపారు. దీనితో పాటు నెట్జరిమ్ మిలటరీ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్లు చెప్పారు.
జులై 31వ తేదీన తమ దేశంలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా, ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ అబ్బాస్ నిల్ఫొరౌషన్ దారుణ హత్యకు నిరసనంగానే ఈ దాడులు చేపట్టినట్లు బఘేరి స్పష్టం చేశారు. మున్ముందు ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తామని తేల్చి చెప్పారు.
Oct 02 2024, 18:22