శ్రీవారి లడ్డూ, అసలు మ్యాటర్ బయటపెట్టేసిన టీటీడీ ఉద్యోగులు
తిరుమల శ్రీవారి లడ్డుల తయారి కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణల వ్యవహారం ఊహించిన మలుపు తిరిగింది. శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి వాడారని, ఆ కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ కు చెందిన ల్యాబ్ నివేదిక ఆధారంగానే తాను ఈ విషయం బయటపెట్టానని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు.
మా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించ లేదని, స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగించామని మాజీ జగన్, టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డు పోటులో వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో నిష్టతో, నియమ నిబంధనలతో శ్రీవారి లడ్డులు తయారు చేస్తుంటారు. శ్రీవారి లడ్డూల తయారీ కోసం నాసిరకం నెయ్యి, నాసిరకం జీడిపప్ప, నాసిరకం యాలకులు, నాసిరకం దినుసులు ఉపయోగించారని లడ్డు పోటులో పనిచేసే సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఈ విషయం అప్పట్లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని, పెద్దలను ఎదిరించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో తాము శ్రీవారి లడ్డూలు తయారు చేశామని తిరుమల లడ్డు పోటులోని కొందరు ఉద్యోగులు, అక్కడ పని చేస్తున్న సిబ్బంది వాపోతున్నారు. శ్రీవారి ఆలయంలో రోజుకి సుమారు మూడు లక్షలకు పైగానే లడ్డూలు తయారు చేస్తారు. ఈ లడ్డుల తయారీ కోసం 14 టన్నుల నెయ్యిని ఉపయోగిస్తామని లడ్డు పోటు సిబ్బంది అంటున్నారు.
తిరుమలలో 82,000 కిలోలకు పైగా సామర్థ్యం ఉన్న మూడు నెయ్యి యూనిట్లు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాబాయ్ వైవీ. సుబ్బారెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా పని చేశారు.. సాధారణంగా తిరుమల మాడవీధుల్లో తిరుగుతుంటే శ్రీవారి లడ్డూల తయారు చేస్తున్న సువాసనకి తిరుమల భక్తులు పరవశించి పోయేవారు. అదంతా గతంలో అని భక్తులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి లడ్డు చేతిలో పట్టుకున్నా సువాసన రావడంలేదని ఇటీవల కాలంలోని తిరుమల భక్తుల ఆరోపించిన విషయము తెలిసిందే.
నాసిరకం నెయ్యి, యాలుకలు, నాసిరకం దినుసులు, జీడిపప్పు వాడితే ఎలా సువాసన వస్తుందని, ఈ విషయంపై అప్పటి టీటీడీ డిప్యూటీ ఈవో, సూపరెండెంట్ల దృష్టికి తీసుకెళ్లామని, నాసిరకం నెయ్యి ఉపయోగించినా, నిసిరకం దినుసులు లడ్డూలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తే సువాసన రాదని తాము పదే పదే చెప్పినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదని, ఉన్నతాధికారులను ఎదిరించి తాము ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండి పోయామని తిరుమల శ్రీవారి లడ్డు పోటులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
మొత్తం మీద శ్రీవారి లడ్డు పోటులో పనిచేస్తున్న ఉద్యోగులే నాసిరకం నెయ్యి లడ్డూల తయారీ కోసం ఉపయోగించామని ఇప్పుడు బయట పెట్టడంతో ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావు ఆ విషయంపై దృష్టి సారించారని తెలిసింది. శ్రీవారి లడ్డు పోటు సిబ్బంది ఫిర్యాదు చేసిన సమయంలో పనిచేసిన డిప్యూటీ ఈవో, సూపరెండెంట్ల వివరాలు తెలుసుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు త్వరలోనే వారి పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
మొత్తం మీద నాసిరకం నెయ్యి ఉపయోగించి శ్రీవారి లడ్డూలు తయారు చేశారని, లడ్డు పోటులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఆరోపించడం కలకలం రేపుతుంది. తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సైతం గతంలో శ్రీవారి లడ్డూలో నాణ్యత లేదని, సువాసన లేదని నాసిరకం నెయ్యి, యాలకులు, జీడిపప్పు, నాసిరకం దినుసులు లడ్డూలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తున్నారని, ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని పలుసార్లు ఆరోపించారు.
అయితే శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోని టీటీడీ అధికారులు అలాగే లడ్డులు తయారు చేశారని శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు శ్రీవారి లడ్డుల తయారీలో నాసిరకం నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో అప్పట్లో లడ్డూల తయారీకి ఇన్ చార్జ్ లుగా ఉన్న సూపరెండెంట్లు ఇప్పుడు భయంతో హడలి పోతున్నారని సమాచారం.
తిరుమల శ్రీవారి లడ్డు పోటులో లడ్డూలు తయారు చేస్తున్న ఉద్యోగులు చేసిన ఆరోపణలపై టీటీడీ ఉన్నతాధికారులు, టీటీడీ విజిలెన్స్, శ్రీవారి లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుతం ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ అధికారులు దృష్టి సారించారని, లడ్డు పోటులో పని చేస్తున్న ఉద్యోగుల నుండి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి, నాసిరకం నెయ్యి ఉపయోగించారని లడ్డు పోటులో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోపించడం కలకలం రేపుతోంది.
Sep 28 2024, 12:17