మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్
మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం మూసీ రివర్ బెడ్‌లో 25 ప్రత్యేక సర్వే బృందాలు చేరుకున్నాయి. ఒక్కో టీమ్ లో తహసీల్దార్ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. రివర్ బెడ్‌లో మొత్తం 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు.
మూసీ (Musi) నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం మూసీ రివర్ బెడ్‌లో 25 ప్రత్యేక సర్వే బృందాలు చేరుకున్నాయి. ఒక్కో టీమ్ లో తహసీల్దార్ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. రివర్ బెడ్‌లో మొత్తం 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్ నిర్మాణాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు ఇళ్ళతో పాటు నష్టపరిహరం చెల్లించేందుకు ప్రభుత్వం (Telangana Govt) సిద్ధమైంది. అయితే పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో మూసీ నివాసితుల సర్వే అధికారులకు సవాల్‌గా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు
మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపొందించినట్లు దాన కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.
దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని దాన కిషోర్ తెలిపారు. రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి పునరావసం కల్పించిన తర్వాతనే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. బఫర్ జోన్‌కు సంబంధించి భూ సేకరణ, పునరావాస చట్టం ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తరువాత చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇస్తామన్నారు. ఆ తరువాత మాత్రమే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని దాన కిషోర్ తెలిపారు. మూసీ పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దని, అర్హులందరికీ పునరావాసం కల్పించడం జరుగుతుందన్నారు.
Sep 27 2024, 15:13