ఉన్న మాటంటే ఉలుకెక్కువ -ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పోషకాహార లోపం -సస్పెన్షన్లు, బలవంతపు రాజీనామాలు తగవు -సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్
ఉన్న మాటంటే ఉలుకెక్కువ
-ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పోషకాహార లోపం
-సస్పెన్షన్లు, బలవంతపు రాజీనామాలు తగవు
-సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్
తాజాగా ప్రకటించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు ప్రభుత్వానికి అసంతృప్తిని కలిగించి ఆ నివేదికను రూపొందించిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ డైరెక్టర్ సస్పెన్షన్‌కు దారి తీసింది. ఇకపై నివేదికల్లో రక్తహీనత అనే పదమే కనిపించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011-12, 2017-18 మధ్యకాలంలో దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న జనాభా శాతం పెరిగిందని జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం వెల్లడించింది. దీంతో ఆ నివేదిక ప్రచురణను ప్రభుత్వం నిలిపి వేసింది. గణాంక వివరాలు బహిర్గతం కావడానికి కారకులనే నెపంతో ఇద్దరు స్టాటిస్టీషియన్లను బలవంతంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేయించటాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ (సీసీజీజీఓఓ) జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ తప్పుబట్టారు.
ఆహారం సరిగా లభించక పోవడం వల్లనే కరువు కాటకాలు సంభవించడం లేదని, సామాజిక, ఆర్థిక అంశాలు కూడా దానికి దోహద పడుతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో పౌష్టికాహార లోపం కుటుంబాల ఆర్థిక వనరులపై ప్రభావం చూపబోతోందని, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా భవిష్యత్‌లో ఆహార భద్రతకు అనేక సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు కేవలం ఆహార ధాన్యాలను మాత్రమే అందిస్తున్నారు తప్పించి అవసరమైన పప్పు ధాన్యాలు మొదలైన నిత్యావసరాలు సరఫరా చేయడం లేదు. ఫలితంగా ప్రజల్లో పోషకాహార లోపం ఏర్పడింది.
అందుబాటులో లేని ఆరోగ్యకరమైన ఆహారం
ఆహార భద్రత, పోషకాహారంపై 2011లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) ఓ పరిశీలన ప్రారంభించింది. భారతదేశంలోని జనాభాలో 74.1 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదని అది తేల్చింది. గతేడాది విడుదలైన ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 111వ స్థానంలో (మొత్తం 125 దేశాల్లో) నిలిచింది. ఈ సూచికలో ప్రతి ఏటా మన ర్యాంకింగ్ పడిపోతూనే ఉంది. 2016లో 97, 2017లో 100, 2018లో 103, 2022లో 107… ఇలా మన ర్యాంక్ పతనమవుతూనే ఉంది. హైతీ, సబ్-సహారా ఆఫ్రికాలోని 12 దేశాలు మాత్రమే మన కంటే తక్కువ ర్యాంకులో ఉన్నాయి. దేశంలో ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు తక్కువ బరువును, 36 శాతం మంది తక్కువ ఎత్తును కలిగి ఉన్నారని 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. వయసుకు తగినట్టు బరువు, ఎత్తు లేకపోవడం పోషకాహార లోపానికి సూచికలు. 19 శాతం మంది పిల్లలైతే ఎత్తుకు తగిన బరువు లేక పీలగా ఉన్నారు. ఇది కూడా పోషకాహార లోపం సూచికే. 2019-21లో దేశ జనాభాలో 36 శాతం మంది కుంగుబాటుకు లోనయ్యారు. 19 శాతం మంది అసాధారణ రీతిలో బలహీనంగా ఉన్నారు. 6-59 నెలల మధ్య వయసున్న పిల్లల్లో 67 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పెద్ద వారిలో… అంటే 15-49 ఏండ్ల మధ్య వయస్కుల్లో 57 శాతం మహిళలు రక్తహీనతకు గురయ్యారు.
సౌకర్యాల కొరతతో వృథా
దేశంలో తృణధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆహారధాన్యాల తలసరి లభ్యత తగ్గిపోతోంది. 1991లో ఒక్కో వ్యక్తికి రోజుకు 510.1 గ్రాముల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండగా 2021లో 507.9 గ్రాములు మాత్రమే లభించాయి. వివిధ కారణాల వల్ల వ్యవసాయోత్పత్తుల్లో 40 శాతం వరకూ నష్టపోవాల్సి వస్తోంది. కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడంతో పండ్లు, పాలు వంటి 1.3 బిలియన్ టన్నుల సరుకులను నష్ట పోవాల్సి వస్తోంది.
వ్యవసాయోత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావం
2020-2050 మధ్యకాలంలో దేశ జనాభా 0.82 శాతం వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా. అంటే శతాబ్దం మధ్య నాటికి దేశ జనాభా 172,33,80,000కు చేరుతుంది. ఇందుకనుగుణంగా తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి సగటున ఏటా వరుసగా 2.65 శాతం, 4.9 శాతం, 2.84 శాతం, 4.65 శాతం, 4.58 శాతం, 11.57 శాతం, 5.82 శాతం మేర పెరగాలి. వాతావరణ మార్పులు సంభవిస్తే ఉత్పత్తిపై ప్రభావం పడవచ్చు. ఉదాహరణకు 2021లో 113 మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి కాగా 2022లో 107 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఈ ఏడాది అది మరింత పడిపోయి 105 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా బియ్యం ఉత్పత్తి పడిపోయింది. అందుకే బాసుమతియేతర బియ్యం ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల ఉత్పత్తి తగ్గిపోతే దాని ప్రభావం ఆకలిపై పడుతుంది. 2050 నాటికి ఆకలితో బాధపడే వారి సంఖ్య 11 నుంచి 20 శాతం వరకూ పెరగవచ్చునని ఓ నివేదిక తెలిపింది. దేశంలో 2022 నుండి తీవ్రమైన వడగాల్పులు సర్వసాధారణమై పోయాయి. వాతావరణ మార్పులే దీనికి కారణం. 1900-2018 మధ్యకాలంలో దేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 0.7 డిగ్రీలు పెరిగింది.
ఉత్పత్తి పెంపు అనివార్యం
జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయోత్పత్తులు పెరగకపోతే ఎగుమతులను తగ్గించుకోవడంతో పాటు నిత్యావసరాలను మరోసారి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడవచ్చు. ఈ పరిణామం మన విదేశీ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. మనం ఇప్పటికే పప్పులు, వంటనూనెలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. బియ్యం, గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధం కారణంగా భారత్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ అంచనా ప్రకారం జనాభా అవసరాలను తీర్చాలంటే 2030 నాటికి 311 టన్నులు, 2050 నాటికి 350 టన్నుల ఆహార ధాన్యాలను మన దేశం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఉత్పాదకతనైనా పెంచాలి లేదా సాగు భూమినైనా పెంచాలని వి. కృష్ణ మోహన్ సూచించారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
వివిధ కారణాలతో దేశంలో 147 మిలియన్ హెక్టార్ల భూమి ఇప్పటికే సారాన్ని కోల్పోయింది. వాతావరణ మార్పులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2050 నాటికి వ్యవసాయ యోగ్యమైన భూమిలో సగం బీడుగా మారిపోయే ప్రమాదం ఉంది. అంతిమంగా అది ఉత్పాదకత తగ్గడానికి దారితీస్తుంది. భూమిలో లవణాలు పేరుకుపోతున్నాయని, ఫలితంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, ఆర్థికాభివృద్ధి దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్ల క్రితం… అంటే 2012-14లో వేసిన ఓ అంచనా ప్రకారం భూమిలో లవణాలు పేరుకు పోవడంతో అప్పటికే 16.84 మిలియన్ టన్నుల వ్యవసాయోత్పత్తులకు నష్టం చేకూరింది. పులి మీద పుట్రలా జల వనరుల లభ్యత కూడా తగ్గిపోతోంది. జనాభాతో పాటు నీటి వినియోగం కూడా పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హరిత విప్లవ కాలం నుంచి నీటి వినియోగం అధికంగా ఉండే పంటలనే రైతులు పండిస్తున్నారు. దేశంలో లభ్యమవుతున్న భూగర్భ జలాలలో 89 శాతం వ్యవసాయానికే ఖర్చవుతున్నాయి. అందుకే 2007-2017 మధ్యకాలంలో భూగర్భ జల మట్టం 61 శాతం పడిపోయింది.
భవిష్యత్తులో ఆకలి కేకలు నివారించేందుకు ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే బదులు సర్వే ఫలితాల ఆధారంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, అంతే గాని నివేదికను రూపొందించిన ఆఫీసర్లను సస్పెండ్ చేయటం, బలవంతంగా రాజీనామాలు చేయించటం మానుకోవాలని ప్రధాన మంత్రికి వి. కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.
Aug 25 2024, 20:44