ఆగని రైల్వే ప్రమాదాలు - ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.
డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో పలువురు సిబ్బంది, ప్రయాణికుల మరణం, గాయాల పాలవడం బాధాకరం.
ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ విఫలం, పరస్పర విరుద్ధమైన నిబంధనలు, కవచ్ రక్షణ వ్యవస్థ లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు.
రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి.
బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత, శానిటేషన్, పార్కింగ్ దోపిడీ తదితర సమస్యలను పరిష్కరించండి.
కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలి. భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలి.
రైలు ప్రమాదాలపై, భద్రతా చర్యల అమలుపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో స్వతంత్ర విచారణ జరిపించాలి.
జూన్ 2023లో అత్యంత ఘోరమైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 296 మంది మరణించి 1100 మందికి పైగా గాయపడిన ఘటన మరువక ముందే దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు దుర్ఘటనలను ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి తాజాగా వ్రాసిన లేఖలో పేర్కొంటూ భద్రతా లోపాలను ఎత్తి చూపారు. నిర్వహణా లోపాలు కారణంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాక్ లపై ఒత్తిడి పెరుగుతుందని, భద్రతా చర్యలు చేపట్టడం లేదని, ఒడిషా రైలు ప్రమాదం నుండి తేరుకోకముందే 40 ప్రమాదాలు జరిగాయని వివరించారు. జూన్ 17 న 11 మంది మృతికి దారితీసిన కాంచన్‌జంగ ప్రమాదానికి కూడా ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ పని చేయకపోవడం, పరస్పర విరుద్ధమైన నిబంధనల మూలంగా నెలకొన్న గందరగోళం, కవచ్ రక్షణ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ), దాని అనుబంధ గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వే ప్రమోటీ ఆఫీసర్స్ ఫెడరేషన్ (ఐఆర్ పిఓఎఫ్) తదితరులు పలుమార్లు వివిధ అంశాలపై సమర్పించిన వినతి పత్రాలను, కాగ్ తదితర నివేదికలను జత చేశారు. రైల్వే భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎమ్ఎస్) పేరిట ప్రవేశపెట్టిన స్కీం పట్ల పునరాలోచన చేయాలని కోరారు.
ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో సిగ్నల్ విఫలమైన సమయాల్లో రైళ్ళ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని, ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్స్ ఇన్ జనరల్ అండ్ సబ్సిడరీ రూల్స్ 9వ అధ్యాయంలో పేర్కొన్న నిబంధనలు పరస్పర విరుద్ధంగా వున్నాయని, వాటిని నిశితంగా సమీక్షించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. సిగ్నల్ విఫలమైనపుడు స్టేషన్ మాస్టర్లు జారీ చేసే ట్రావెల్ అథారిటీ టిఎ-912 రెడ్ సిగ్నల్ పడినా దాటేందుకు లోకో పైలెట్లకు అనుమతినిస్తుందని, దాన్ని నిషేధిస్తున్నట్లు తూర్పు రైల్వే ఆదేశాలు జారీ చేసి ఆ మరుసటి రోజే పొరపాటున జారీ చేసామని ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నారని తెలిపారు. స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపి)పై జోనల్ రైల్వేస్‌లో అయోమయం, గందరగోళం వుంటొందని, సిగ్నల్ వైఫల్యం తదితర పరిస్థితుల్లో అమలు చేయాల్సిన రైళ్ళ నిర్వహణా ప్రొటోకాల్స్‌లో గందరగోళానికి కారణమవుతోందని వాపోయారు.
2011-12 లో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' నెలకొల్పక పోవడం, సిగ్నలింగ్ టెలీ కమ్యూనికేషన్ కింద కేటాయించిన బడ్జెట్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ తదితరములకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయక పోవడం, రైల్వే లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు.
భద్రతా చర్యల బలోపేతంలో తాత్సారం తగదని, కృత్రిమ మేధస్సు (ఏఐ) ను సిబ్బంది తొలగింపుకు, పోస్టుల రద్దుకు వినియోగించే బదులు విస్తృతంగా స్టేషన్ డేటా లాగర్ల, లోకోమోటివ్ లలోని మైక్రో ప్రాసెసర్ల డిజిటల్ డేటాను తక్షణమే విశ్లేషించి ప్రమాదాలను నివారించాలని, నిధుల కేటాయింపును పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధి అవకాశాలను నాశనం చేసేందుకు కాక ప్రమాద రహిత భద్రమైన రైల్వే వ్యవస్థకై వినియోగించాలని కోరారు. ఒకవేళ దేశవ్యాప్తంగా కవచ్ ను వెంటనే ఏర్పాటు చేయలేనట్లైతే ఈటీసీఎస్ లెవెల్ 3 ని కాకపోయినా కనీసం లెవెల్ 2 ను వినియోగించాలని విన్నవించారు.
ట్రైన్ ప్రొటక్షన్ & వార్నింగ్ సిస్టం ( టీపీడబ్లూఎస్) రిపేరుకు సాధ్యంకాని విధంగా వైఫల్యం చెందడంతో గత సంవత్సరంలోనే ఉత్తర రైల్వే స్పీడును తగ్గించాలని చేసిన ప్రతిపాదన బోర్డు వద్దే పెండింగ్ లో నున్నదని, జూన్ 25న నార్త్ సెంట్రల్ రైల్వే కూడా రైళ్ళ వేగాన్ని తగ్గించాలని ప్రతిపాదించిందని, దేశవ్యాప్తంగా రైల్వే ట్రాకులు 130 కి.మీ స్పీడుని మించి తట్టుకోలేవని పేర్కొన్నారు.
68 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ లో గత దశాబ్దంలో కేవలం రెండు శాతం (1,465 కి.మీ) రూటు లోనే, 15,200 డీజిల్ , విద్యుత్ లోకో లలో ఒక శాతం కన్నా తక్కువ (139) ఇంజన్లలోనే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ (ఏటీపీ) కవచ్ అమలు జరిగిందని, సాలీనా 2శాతం రైల్వే కాపెక్స్ తో అన్ని ఇంజన్లు, ట్రాక్ లలో కవచ్ 4.0ను ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.
కనీస అవసరాలకు ప్రాధాన్యత నివ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, 3,018 గెజిటెడ్ క్యాడర్ సాంక్షన్ అయిన పోస్టులు ఖాళీగా వున్నా భర్తీకి నోచుకోకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో చాలా మంది మహిళా లోకో పైలట్లు, ఇతర సిబ్బంది రోజుకు 12 గంటలకు మించి సెలవు, విశ్రాంతి లేకుండా నిద్రలేమి, బిజీ షెడ్యూల్స్ తో పని చేస్తున్నారని తెలిపారు. రైల్వేలో పని చేస్తున్న సుమారు 8 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, చట్టబద్ద హక్కులు కోల్పోయారని, ప్రశ్నిస్తే తొలిగింపులు, సస్పెషన్లు, బదిలీలు, శిక్షలు వంటి సమస్యల మధ్య రైల్వే సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి ఆర్ఆర్ బి దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల సంఖ్యను 5,696 నుండి 18,799 కు పెంచి భర్తీ చేయాలని నిర్ణయించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సరెండర్ చేసిన, రద్దైన పోస్టులు పోను రైల్వేలో ఏళ్ళ తరబడి ఖాళీగా ఉన్న 2,74,580 పోస్టులను వికేంద్రీకరించి భర్తీ చేయాలని కోరారు. కనీసం సేఫ్టీ కేటగిరీలోని 1,52,734 ఖాళీలను యుద్ధప్రాతిపదికన జోనల్ స్థాయిలో పూరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ వాదనలు దాని స్వంత ఆడిటర్ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. రైలు భద్రతపై కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్ విశ్లేషణ ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392 ప్రమాదాలు (69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢీ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారిందనీ, అయితే కాగ్ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నదని తెలిపారు.
ట్రాక్ ల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యమని కాగ్ 2022 సెప్టెంబర్ నివేదికలో అక్షింతలు వేసినా, రైలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా, లోపాలు ప్రస్తావించినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
2017-18లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) రైల్వే భద్రతా నిధి గురించి కాగ్ ఉటంకించింది. 1127 పట్టాలు తప్పగా 289 (26 శాతం) మాత్రమే పునరుద్ధరణ పనులకు నోచుకున్నాయని వివరించింది. ఆర్‌ఆర్‌ఎస్‌కే నుంచి ప్రాధాన్యత-1 పనులపై మొత్తం వ్యయం 2017-18లో 81.55 శాతం నుంచి 2019-20లో 73.76 శాతానికి తగ్గుదల ధోరణిని చూపించిందని పేర్కొన్నది. ట్రాక్ పునరుద్ధరణ పనులకు 2018-19లో నిధుల కేటాయింపు రూ.9607.65 కోట్ల నుంచి 2019-20లో రూ.7417 కోట్లకు తగ్గిందని కాగ్ వివరించింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019-20లో మొత్తం వ్యయంలో ట్రాక్ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావటం గమనార్హం. భద్రతకు సంబంధించిన పనులకు ఆర్థిక సాయం అందించటానికి ప్రత్యేక నిధిని సృష్టించే ఏకైక ఉద్దేశ్యం విజయం సాధించ లేకపోయిందని కాగ్ పేర్కొన్నది. పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్ నిర్వహణ అని వివరించింది. భారత రైల్వే లక్షలాది ఖాళీలతో, నామ మాత్రపు అవుట్‌సోర్సింగ్‌తో కార్యకలాపాలను నిర్వహించిందని కాగ్ వెల్లడించింది.
ట్రాక్ ల సమర్థవంతమైన నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థ, రోలింగ్ స్టాక్ మొదలైన వాటితో పాటు తగిన సంఖ్యలో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించడం మరియు అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే ఆపరేషన్ యొక్క వివిధ విధుల మధ్య సమర్థవంతమైన సమన్వయంపై ఆధారపడి ఉంటాయి. వీటన్నింటినీ నిర్లక్ష్యం చేయబడ్డాయని తెలిపారు. 2017 లో సమర్పించిన భద్రతపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులను, 2015 లో రైల్వే మంత్రిత్వ శాఖ 'శ్వేతపత్రం'ను అమలు చేయలేదు. పాత ట్రాక్ ను యుధ్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంటుందని, కానీ ఆర్థిక వనరులు లేమి సాకుతో చేయకపోవడంతో బ్యాక్ లాగ్ పెరుగుతూనే ఉన్నదని, అదే సాకుతో పాతబడి పోయిన సిగ్నల్ గేర్ ను కూడా మార్చటం లేదని అన్నారు.
రైల్వేలు ప్రజల ఆస్తియని,మన ప్రజల సొమ్ముతో భారత కార్మికుల కష్టాలతో భారతీయ రైల్వేలు నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. రైళ్ళు, రోడ్లు సామాన్య ప్రజలకు సరసమైన రవాణాను అందించడానికి ఉద్దేశించబడినవని, ఇవి ఏ ప్రభుత్వమైనా తన పౌరులకు సరసమైన ధరలకు భద్రతతో అందించాల్సిన సేవలని గుర్తు చేశారు. ప్రైవేటు కార్పొరేట్లకు లాభాలను ఆర్జించే మార్గాన్ని సృష్టించేందుకు భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించవద్దని కోరారు.
రైళ్ళు ప్రయాణించే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థను నియంత్రించే ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో పొరపాటు కారణంగా బాలాసోర్ ప్రమాదం జరిగిందని రైల్వేబోర్డు, రైల్వే మంత్రి పేర్కొన్నారు. 2017-21 మధ్య కాలంలో రైల్వేస్‌లో రైళ్ళు పట్టాలు తప్పిన ఘటనలపై కాగ్ ఇచ్చిన నివేదిక వ్యవస్థలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన లోపాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. రైల్వే ట్రాక్‌ల్లో నిర్మాణపరమైన లోపాలను, అలాగే పాయింట్లు, లైన్లు, కర్వ్‌లు వంటి అంశాలను తనిఖీ చేసి అంచనా వేసే ట్రాక్ రికార్డింగ్ కార్ల సోదాలు 30-100 శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. పట్టాలు తప్పిన 1129 ఘటనల్లో 422 ఘటనలు ఇంజనీరింగ్ సమస్యలు (ట్రాక్‌ల నిర్వహణ సరిగా లేక పోవడం (171 కేసులు), ట్రాక్ ప్రామాణికాలు పాటించకపోవడం (156 కేసులు) వల్లే జరిగాయని పేర్కొంది. బోగీల చక్రాల్లో లోపాల వల్ల జరిగిన ప్రమాదాలు 182 ఉండగా, పాయింట్లు సరిగా నిర్దేశించక పోవడం, ఇతర పొరపాట్ల కారణంగా 275 ప్రమాదాలు జరిగాయని నివేదిక పేర్కొంది. గడిచిన పదేళ్లలో రైలు ప్రమాదాల్లో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 70 శాతం మంది 2017- 21 మధ్య కాలంలో మరణించారని పేర్కొన్నారు.
ప్రారంభించిన రైలునే అట్టహాసంగా మళ్ళీ ప్రారంభించే బదులు సామాన్యులు ప్రయాణించే రైళ్ల బాగోగులు పట్టించుకోవాలని, కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణే అన్నింటికీ పరిష్కారం అనే మానసిక స్థితి నుండి బయటపడి వాస్తవాలను ఆలోచించి ప్రజల భద్రతకు ఏం చేయాలో తెలుసుకుని ఇప్పటికైనా పూనుకోవాలని, దుఃఖితులకు ఓదార్పునివ్వాలని కోరారు. ప్రతి వందేభారత్ కోసం రైల్వే రూ. 115 కోట్లు పైగా వెచ్చిస్తున్నదని, 2027 తర్వాత ప్రారంభమయ్యే బుల్లెట్ ట్రైన్ వంటి అసాధారణ రేట్లుండే రైళ్ళతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేముంటుందని ప్రశ్నించారు. గతంలో రైల్వే అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించే వారని, ఇప్పుడు ఆ పద్ధతీ నిర్వీర్యమై పోయిందని, వీటన్నింటి ఫలితంగా ప్రజల భద్రత మరింత ప్రమాదంలో పడిందని తెలిపారు.
తమ వైఫల్యం, అసమర్థతలను, చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఘోర రైలు ప్రమాదాల్లో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని, ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే మంత్రిత్వ శాఖకు ఇది అలవాటేనని ఆయన పేర్కొన్నారు. ఐటీ సెల్ లోని పెయిడ్ ఆర్టిస్టులు దానికి అన్ని రకాల అబద్ధాలూ గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేసరికి ప్రజలు దాన్ని మర్చిపోతారని ఆయన పేర్కొన్నారు.
2023 మార్చిలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ సమర్పించిన నివేదికలో రైల్వే మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని ఎత్తి చూపిందని, రైల్వే భద్రతకు సంబంధించిన నివేదికలు విస్మరించబడుతున్నాయని వివరించిందని తెలిపారు. కమీషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్) చేసిన సిఫారసులు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అత్యంత ప్రాముఖ్యతను పొందవల్సి ఉన్నప్పటికీ అది వాస్తవానికి భిన్నంగా ఉన్నదని పేర్కొన్నది. రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని ప్యానెల్ ఆ నివేదికలో సిఫారసు చేసిందని గుర్తు చేశారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలని,కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలని వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Jun 27 2024, 14:09