అమ్మాయిలకేది రక్షణ ...అధికారులు ఏం చేస్తున్నారు: కొడారి వెంకటేష్ ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు
నేటి సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే పాపమైపోయిందని, అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, కామాందుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఏడాది కాలంగా అభం శుభం తెలియని అమాయక పిల్లలపై ప్రధానోపాధ్యాయుడే కాటేస్తుంటే మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం, నెల నెలా లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటూ పిల్లల హక్కుల్ని భంగం చేస్తున్నారని ఆయన అన్నారు. గుండాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి చేసిన అఘాయిత్యానికి మొత్తం ఉపాద్యాయ లోకం తలదించుకుని, సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భువనగిరి లో పరీక్ష రాస్తున్న సమయంలో ఓ లెక్చరర్ అసభ్య ప్రవర్తన, చౌటుప్పల్ లో తల్లిదండ్రుల వద్ద ఆదమరచి నిద్రపోతున్న చిట్టితల్లిని ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు తన కోరిక తీర్చుకోవడం, గుండాల లో విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో తల ఎత్తుకొని నిలబడేలా చేయాల్సిన గురువే, ఆ చిన్నారులతో తన కోరికలు తీర్చుకునే సంఘటనలు చూస్తుంటే, పిల్లలను చదువులు మాన్పించి, బాల్యవివాహాలు చేసి బాధ్యత తీర్చుకోవడమే మంచిదని తల్లిదండ్రులకు భావన కలుగుతుందని ఆయన అన్నారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడినా, వారితో అసభ్యంగా ప్రవర్తించినా, నిందితులకు ఉరిశిక్షే సరియైన శిక్ష అని ఆయన అన్నారు .భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు , చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Apr 10 2024, 16:26