కడప బరిలోనే షర్మిల
5 ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్ క్లియర్
నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటన
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది..
రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్‌సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను మంగళవారం ఇడుపులపాయలో ప్రకటించనున్నారు.
సీఈసీ సమావేశం సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ఎస్టీఎస్టీసెల్ చైర్మన్ కొప్పుల రాజు, షర్మిల పాల్గొన్నారు.
మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు గాను 117 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఈ సందర్భంగా చర్చించారు. కడప ఎంపీ స్థానంలో షర్మిల, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, విశాఖ-సత్యారెడ్డి, కాకినాడ-ఎంఎం పళ్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు తెలిసింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల బరిలో లేరని సమాచారం. కమ్యూనిస్టు పార్టీలతో సర్దుబాటు నేపథ్యంలో మిగిలిన స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన కోసం షర్మిల మంగళవారం కడప జిల్లాకు వెళ్తున్నారు..
Apr 02 2024, 10:38