NLG: ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆసరాగా.. పగడాల కనకయ్య పౌండేషన్
చింతపల్లి మండలం, మాల్: కుటుంబంలో పెద్ద దిక్కుకు కష్టం వస్తే, ఆ కుటుంబమే చిన్నాభిన్నం అవుతుంది. ఎటూ తోచని అలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్. మాడ్గుల మండలం, కొలుకులపల్లి గ్రామానికి చెందిన చొల్లేటి బ్రహ్మచారి గత కొంతకాలంగా డయాలసిస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇంటి పెద్దకే ఆపద రావటంతో, భార్య స్వప్నకు ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. బాధితుడికి ఇద్దరు చిన్న వయసు గల ఆడపిల్లలు కూడా ఉన్నారు. డయాలసిస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతూ, ఒంటి చేతితో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారి కుటుంబానికి ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు అండగా నిలిచారు.
బాధితుడి భార్య స్వప్న మాల్ నందు గల ఫౌండేషన్ ని సంప్రదించి సహాయం కోరడంతో, విషయం తెలుసుకున్న చైర్మన్ పగడాల ముత్తు, వారి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఫౌండేషన్ ని సంప్రదించాలని వారికి తెలిపారు.
అభాగ్యులకు బాసటగా నిలుస్తున్న చైర్మన్ ముత్తుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సహాయం చేస్తున్న ఫౌండేషన్ వర్ధిల్లాలని దీవిస్తున్నారు. ఈ సందర్బంగా పగడాల ముత్తు మాట్లాడుతూ.. తన తండ్రి కనకయ్య జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసామని, పేద ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉంటామని అన్నారు. తన తండ్రి ఋణం తీర్చుకోవడానికి ఈ ఫౌండేషన్ ను స్థాపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, కార్యదర్శి పగడాల కళ్యాణ్, మొగిలి కిషన్, మెంబర్ నాంపల్లి పరమేష్ ఉన్నారు.
Feb 19 2024, 10:18