Chandrababu : మహా స్వాప్నికుడు చంద్రబాబు.. నేడు పుస్తకావిష్కరణ
అమరావతి: ''అన్ని సమస్యలకూ మూలం ప్రజలే అనే రాజకీయ పార్టీల సంప్రదాయ ఆలోచనా ధోరణుల్ని కూకటివేళ్లతో పెకలించి... ప్రజలే అన్ని సమస్యలకూ పరిష్కారం అని చాటిచెప్పిన రాజకీయ నాయకుడు చంద్రబాబే..
ప్రధాని నరేంద్రమోదీ గత పదేళ్లుగా అమలుచేస్తున్న స్వచ్ఛభారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో- బేటీ పఢావో వంటి పథకాల్ని పాతికేళ్లకు ముందే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అమలు చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనం''
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుపై సీనియర్ పాత్రికేయుడు పూల విక్రమ్ రచించిన 'మహా స్వాప్నికుడు' పుస్తకంలోని వాక్యాలివి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి... కృషి, పట్టుదల, నిరంతర శ్రమే ఆయుధాలుగా అంచెలంచెలుగా ఎదిగి, తన దార్శనికతతో రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించిన చంద్రబాబు గురించి పుస్తకంలో వివరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ప్రచురించిన ఆ పుస్తకాన్ని... విజయవాడలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నారు.
అన్ని పార్శ్వాలనూ స్పృశిస్తూ...
చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతో ప్రారంభించి... ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, జగన్ ప్రభుత్వం కక్షసాధింపుతో పెట్టిన తప్పుడు కేసుల్ని దీటుగా ఎదుర్కోవడం, 53 రోజులపాటు అక్రమంగా జైల్లో పెట్టినా మొక్కవోని దీక్షతో ఆయన సాగిస్తున్న అలుపెరగని పోరాటం వరకు... అన్ని అంశాల్నీ పుస్తకంలో పొందుపరిచారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారాలు-వాస్తవాలపై ఒక అధ్యాయమే ఉంది. చంద్రబాబు కుటుంబానికి రెండు ఎకరాల ఆస్తి మాత్రమే ఉండేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఆస్తులు సంపాదించారన్నది ఎలా దుష్ప్రచారమో వివరించారు.
''చంద్రబాబు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆయనపై అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఆయన అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేశారు. ఆయన 'వ్యవసాయం దండగ' అన్నారన్నది వాటిలో ఒకటి. వైఎస్ ముఖ్యమంత్రయ్యాక ఒక సందర్భంలో... వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్ వెతికి తీయాలని అధికారుల్ని ఆదేశించారు. సమాచార శాఖ ఉద్యోగులు వారం రోజులు అన్ని పనులూ పక్కనపెట్టి పాత వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు శోధించారు. కానీ ఏ పేపర్‌లోనూ వారికి అలాంటి స్టేట్‌మెంట్ దొరకలేదు. దాంతో తేలు కుట్టిన దొంగల్లా కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉండిపోయారు'' అని రచయిత వివరించారు.
Feb 11 2024, 11:54