నూతన సంవత్సర వేడుకలను ఉద్దేశించి నలగొండ పోలీస్ శాఖ తరపున ప్రజలకు విజ్ఞప్తి..
నల్గొండ పోలీసు శాఖ తరపున ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని, ప్రజల రక్షణ కొరకు, నల్గొండ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది.
నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు లేదా ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు. ఎవరైనా చట్ట నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏదైనా మ్యూజికల్ లేదా ఎంటర్టైన్మెంట్ లేదా ఈవెంట్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అంతే కాకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాల పేరుతో, టికెట్లు/ ఎంట్రీ ఫీజుల రూపంలో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నూతన సంవత్సర వేడుకల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యుక్త వయసు పిల్లలకు, మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలకు, బైక్స్/ కార్లను ఇచ్చినచో, వారు అట్టి వాహనాలను నిర్లక్ష్యంగా లేక మద్యం, మత్తు పదార్థాలు సేవించి నడపడం వలన ప్రమాదాలు జరిగి, దాని వలన వారికి గానీ లేక వారివల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయంలో తల్లితండ్రులు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి. ఈ సందర్బంగా "డ్రంకెన్ డ్రైవింగ్ " కేసులు నమోదు చేసేందుకు, అతివేగం/ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు మరియు త్రిబుల్ రైడింగ్ నడిపే వారి కొరకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
కావున 31వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట తరువాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ ఉండే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయి. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ తమ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంటలోపు పూర్తిచేసుకుని తమతమ ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి.
అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, లేక ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది
పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పూర్తి శాంతియుత మరియు ఆహ్లాదకరమైన వాతావరణం లో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి.
ఈ నూతన సంవత్సర వేడుకలు ఎవరింట్లో కూడా విషాదాన్ని నింపకూడదని కోరుకుంటూ, అందుకొరకు ప్రజలందరూ మా సూచనలు పాటించి అన్ని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను: డి ఎస్ పి నల్లగొండ.
Jan 01 2024, 17:15