మునుగోడు: బెల్టు షాపులను మూసి వేయాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు
మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపు ల మూసివేత పై కార్యాచరణ ప్రకటించిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
ప్రతి గ్రామానికి గ్రామ అభివృద్ధి కమిటీ లను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు దిశా నిర్దేశం
గ్రామ అభివృద్ధి కమిటీల పనితీరును పరిశీలించడానికి త్వరలోనే నియోజకవర్గ గ్రామస్తులతో కలిసి పది బస్సుల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో స్టడీ టూర్ కు ప్లాన్ - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు లోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సోమవారం మండలం లోని 26 గ్రామాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను మూసివేయాలని ప్రజలకు సూచించారు. తాను ప్రచారం చేస్తున్న సందర్భంలో ఎంతో మంది మహిళలు గ్రామాలలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు షాప్ ల వల్ల సంసారాలు ఆగమవుతున్నాయని, తమ దృష్టికి తీసుకొచ్చారని, ఎన్నికల ప్రచారంలో బెల్ట్ షాపులు మూసేస్తామని హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా బెల్ట్ షాపు ల మూసివేతకు కార్యాచరణ ప్రకటించారు. బెల్ట్ షాపుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటానని,
తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానానికి వ్యతిరేకం కాదు, కానీ బెల్ట్ షాపులు.. ఎక్కడబడితే అక్కడ ఉండడం వల్ల యువత చెడిపోతుందన్నారు.
చట్ట ప్రకారం బెల్ట్ షాపులు నిర్వహించడానికి వీలులేదని, గ్రామాలలో నాయకులు అందరూ ఏకమై బెల్టు షాపు లు లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బెల్ట్ షాపుల్ని బంద్ చేయించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని, ఈ అంశం రాజకీయాలతో సంబంధంలేదని ముఖ్య నాయకులకు సూచించారు.
బెల్ట్ షాపు ల విషయంలో రాజి పడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. రాబోయే తరాలకు ఈ విచ్చల విడి తాగుడు వల్ల మనం ఏం సందేశం ఇస్తున్నామని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు మూసి వేయడం అనేది గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని సూచించారు. బెల్ట్ షాపులు మూసివేసే ప్రయత్నంలో తనతో నడిచిన వాళ్లకే ప్రాముఖ్యత ఇస్తానని, నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకోసం కాదు సమాజం కోసం, ప్రజల కోసం అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.
2014 ముందు గ్రామాలలో బెల్ట్ షాపులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు లేవని టిఆర్ఎస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు వచ్చి ఎంతోమంది యువకులు చనిపోయారని వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరి మీద ఉందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ఆషామాషీగా తీసుకోవద్దు.. 'బెల్ట్ షాపు ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలి' అని పిలుపునిచ్చారు. ఒక ఉద్యమం లాగా ఇది రావాలి.. బెల్ట్ షాపులు మూసివేయాలని.. ప్రతి గ్రామంలో దండోరా వేయించాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రతి గ్రామంలో 10 మందితో ఒక కమిటీ వేయాలని ఈ 10 మందిలో నలుగురు మహిళలు ఉండేలా చూసుకోవాలని.. ఊరి పొలిమేర లోపల గంజాయి గానీ, తాగుడు గానీ లేకుండా చేయడం ఈ కమిటీ యొక్క విధి అని సూచించారు.
ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి గ్రామంలో ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటి ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఈ అభివృద్ధి కమిటీ ద్వారానే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయాలనే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని.. దానికి సంబంధించిన నిధుల సమకూర్చడం విషయాలు కూడా చర్చించాలని పేర్కొన్నారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పనితీరుని పరిశీలించడానికి ఆర్మూరు నియోజకవర్గానికి త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా 10 బస్సులలో వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు తాను కూడా వచ్చి పరిశీలిస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
Dec 27 2023, 19:16