TS: జేఎన్1తో ఆందోళన అక్కర్లేదు: డాక్టర్ నాగేశ్వరరెడ్డి
హైదరాబాద్: కరోనా వైరస్ లోని కొత్త వేరియంట్ జేఎన్.1 అంత ప్రమాదకరమేమీ కాదని, ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) హాస్పిటల్స్ ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
2020లో ప్రపంచాన్నే స్తంభింపజేసి, 2021లో డెల్టా రూపంలో పెద్దసంఖ్యలో ప్రాణాలు హరించిన కొవిడ్.. 2022 తొలినాళ్లలో ఒమిక్రాన్‌గా విరుచుకుపడింది. దాదాపు 18 నెలలుగా మహమ్మారి జాడ కనిపించలేదు. మాస్కులు వదిలేసి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఉన్నట్టుండి ‘జేఎన్1’ రూపంలో కరోనా మళ్లీ ప్రజా జీవితంలోకి వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజల్లో కోవిడ్ కొత్త వేరియంట్ పై ఎన్నో భయాలు, ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘జేఎన్.1’ స్వభావం, దాని వ్యాప్తి, తీవ్రత, ప్రమాదమా? తదితర అంశాలపై డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి పలు అంశాలు వెల్లడించారు.
జే ఎన్ 1 కొత్త వైరస్ కాదు, కానీ కొత్త వేరియంట్. కరోనా చైనాలో పుట్టినప్పటి నుంచి అనేక రూపాలు మార్చింది. అందులో ఒకటి ‘ఎక్స్‌బీబీ’. దాని ఉత్పరివర్తనమే ‘జేఎన్1’. జన్యు క్రమ విశ్లేషణ చేయగా.. స్పైక్ ప్రొటీన్‌లో వృద్ధి చెందినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్‌లోని లక్సంబర్గ్ అనే చిన్న దేశంలో మొదట బయటపడింది. ఆ తర్వాత యూరప్‌లోని ఇతర దేశాల్లోనూ అక్కడక్కడా కనిపించింది. కానీ అంత ఉద్ధృతంగా వ్యాప్తి చెందలేదు. ఒకవేళ అంటువ్యాధి అయి ఉంటే.. ఈపాటికి అంతటా వ్యాప్తి చెందేది. డెల్టా, ఒమిక్రాన్‌లు నెలరోజుల్లోనే అంటువ్యాధులు గా మారాయి.
ప్రపంచ దేశాల్లో ఎక్కడా జేఎన్1ను ఉపద్రవంగా ప్రకటించలేదు. ప్రస్తుతం సింగపూర్‌లో 56వేల కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ కేసులు హాంగ్‌కాంగ్, చైనా వంటి దేశాల్లో కొంచం ఎక్కువగా ఉన్నాయి. దీని వ్యాప్తి, లక్షణాలు, పర్యవసనాలను వైద్యనిపుణులు సునిశితంగా గమనిస్తున్నారు. కేరళలో నమోదైన కేసుల నమూనాలను విశ్లేషిస్తే స్వల్ప సమస్యలు మాత్రమే ఉత్పన్నమవుతున్నాయని తెలుస్తోంది.
Dec 25 2023, 16:19