TS: ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రెండో ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సిఎం రేవంత్ రెడ్డి.. బాధ్యతలు తీసు కున్న మొదటి రోజు నుండి వరుసగా అధికారులతో సమీక్షలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్, టీఎస్పీఎస్సీ, రైతు బంధు అంశాల పై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి..తాజాగా సమస్యల నిలయంగా మారిన ధరణి పోర్టల్‌పై ఫోకస్ పెట్టారు.
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహ్మతా జ్యోతి బా పూలే భవన్ లో నిర్వహిస్తోన్న ప్రజా దర్బార్ (ప్రజావాణి) లో సైతం ఎక్కువగా ధరణి పోర్టల్‌పైనే ఫిర్యాదులు రావడంతో రేవంత్ దీనిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ రోజు మధ్నాహ్నం సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ పై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రెవిన్యూ మంత్రి పొంగులేటి, సంబంధిత శాఖ అధికారులు హాజరుకానున్నారు. అయితే, భూముల డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ సమస్యల నిలయంగా మారిన విషయం తెలిసిందే.
ధరణి పోర్టల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ధరణి పోర్టల్‌తో కొంత మంది బీఆర్ఎస్ నేతలు అధికారులతో కుమ్మక్కై అసైన్డ్ ల్యాండ్స్ ను, ఇతర ప్రభుత్వ భూములను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కబ్జా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి దాని స్థానంలో కొత్త విధానం తీసుకువస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో రావడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమస్యల కుప్పగా మారిన ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ వేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌పై తదుపరి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
ఇక, అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించడంతో..ఇవాళ్టి సమీక్షపై ఉత్కంఠ నెలకొంది. ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Dec 13 2023, 14:04