రాష్ట్రనికి ఎన్నికల కమిషన్ నివేదిక !
- నేటితో ముగియనున్న ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం
- అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో ఎన్నికల సంఘం పర్యటన
- అక్టోబర్ నెలలో ఎన్నికల షెడ్యూలు కు తుది నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. అక్టోబర్ 3 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించనుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాలి. అక్టోబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లో ఎన్నికలు, ఆ తర్వాత ఫలితాలు ఇలా షెడ్యూల్ ఉండనుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని ఏప్రిల్, మే నెలలో జరిగే ఛాన్స్ ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.
ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో ఈ పర్యటనలో సమావేశం కానుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై వారితో చర్చించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ఏర్పాట్లపై సమీక్షించనుంది.
ఈసీ బృందం అక్టోబర్ 4 పర్యటనలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానుంది. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనుంది. అక్టోబర్ 5న చివరి రోజు ఈసీ బృందం తెలంగాణ సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అలాగే ఓటర్ల జాబితా, ఓటర్లకు అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించింది. బీజేపీ, కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కరత్తులు మెుదలుపెట్టాయి. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. త్వరలోనే ఆ రెండు ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నాయి. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి.
Sep 19 2023, 22:03