Amit shah: పటేల్ 'ఆపరేషన్ పోలో'తో నిజాం మెడలు వంచారు: అమిత్‌షా
హైదరాబాద్: నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్ విముక్తికి అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.
ఈ వేడుకల్లో అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద అమిత్‌షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
పటేల్ లేకపోతే అంత త్వరగా విముక్తి లభించేది కాదు
ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు. ''హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగింది. ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నా. 'ఆపరేషన్ పోలో' పేరుతో నిజాం మెడలు పటేల్ వంచారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారు. పటేల్ లేకపోతే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు'' అని అమిత్‌షా అన్నారు. భారాస ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు లేకుండానే ఆయన తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. అనంతరం పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అమిత్‌షా పంపిణీ చేశారు.
Sep 17 2023, 12:29