నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత,సీఎం కేసీఆర్ తొలి సారి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు.
బుధవారం మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయం. జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాక కోసం అధికారులతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
మెదక్ జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న ఔరంగాబాద్‌లో 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.70 కోట్ల వ్యయంతో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. 2018లో సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌లో 35 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. అలాగే జిల్లా స్థాయి అధికారుల కోసం ప్రత్యేక క్వార్టర్స్ కూడా నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో.. 10 ఎకరాల గ్రీనరీని.. కలెక్టరేట్‌కు రెండు ద్వారాలను ఏర్పాటు చేశారు.
ఇక జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని 63 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎస్పీ, ఏఎస్పీ గదులతో పాటు వారి ఓఎస్డీలు, సీపీలు, పీఆర్వోలకు ప్రత్యేక గదులు నిర్మించారు. స్టోర్స్ ఇంచార్జి, ఔట్ వార్డు, పాస్‌పోర్ట్ విచారణ, ఐటీసీ విభాగాలు, రిసెప్షన్, ఫిర్యాదుల కోసం ప్రత్యేక హాల్ నిర్మించారు. కార్యాలయం పక్కనే ఎస్పీ రెసిడెన్స్, పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను కూడా నిర్మించారు.
ఇక నూతన కలెక్టరేట్ భవనానికి సమీపంలోనే జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని రూ.60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి బీఆర్ఎస్ భవన్ నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయ్యింది.
అయితే పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలనే ఉద్దేశంతో పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు పూర్తి కావడంతో వాటితో పాటే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
మెదక్‌లో ప్రారంభోత్సవాలు పూర్తి అయిన వెంటనే మెదక్ చర్చి కాంపౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ వస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.....
Aug 23 2023, 17:44