Flights: రెండు విమానాలు.. ఒకే సమయానికి ల్యాండింగ్, టేకాఫ్.. తర్వాత ఏం జరిగిందంటే?
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi) విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు రన్‌వేపైకి రావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు అప్రమత్తమయ్యారు..
రెండూ.. విస్తారా విమానయాన సంస్థకు (Vistara Airlines) చెందిన విమానాలే కావడం గమనార్హం. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...
బుధవారం ఉదయం దిల్లీ నుంచి బాగ్‌డోగ్రా వెళుతున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే725 విమానం టేకాఫ్ అయ్యేందుకు దిల్లీ విమనాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేపైకి వచ్చింది. అదే సమయంలో అహ్మదాబాద్ నుంచి దిల్లీ వస్తున్న విస్తారా విమానానికి ఏటీసీ అనుమతి లభించడంతో పక్కనే ఉన్న మరో రన్‌వేపై ల్యాండ్ అయింది.
ఈ క్రమంలో ల్యాండ్ అయిన విమానం.. దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం ఉన్న రన్‌వేపైకి వస్తుండటాన్ని మహిళా పైలట్ గుర్తించి ఏటీసీని అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే తమ తప్పును గుర్తించిన ఏటీసీ అధికారులు.. టేకాఫ్ ఆపేయాలని దిల్లీ-బాగ్‌డోగ్రా విమానం పైలట్‌కు సూచించారు.
దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో రెండు విమానాల మధ్య దూరం కేవలం 1.8 కి.మీలే. సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యేప్పుడు రన్‌వేపైకి ఇతర విమానాలు, వాహనాలను అనుమతించరు. అలాగే, ఒక రన్‌వేపై విమానం టేకాఫ్ అవుతుంటే.. పక్కనే ఉన్న మరో రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు అనుమతించరని ఏటీసీ అధికారి తెలిపారు..
Aug 23 2023, 17:29