మూడ్రోజులకే ఎమ్మెల్యే టికెట్ !
- భద్రచాలం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం
- పార్టీలో చేరిన మూడ్రోజులకే టికెట్
- ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం
అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. మెుత్తం 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులతో జంబో లిస్ట్ విడుదల చేశారు. పార్టీ అంతర్గతంగా నిర్వహించిన వివిధ సర్వేల నివేదికల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించారు.
ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో వైరా, ఇల్లందు ఇద్దరు అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరిగినా.. ఇల్లెందులో బానోత్ హరిప్రియ నాయక్‌కు మరోసారి అవకాశం కల్పించారు. వైరాలో మాత్రం రాములు నాయక్‌కు మెుండిచెయ్యి చూపించారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మె్ల్యే మదన్ లాల్‌కు అవకాశం కల్పించారు.భద్రాచలం నియోజవర్గానికి చెందిన తెల్లం వెంకట్రావుకు పార్టీలో చేరిన మూడ్రోజుల్లోనే టికెట్ సాధించారు.
మాజీ ఎంపీ పొంగులేటి ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకట్రావు.. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడి రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల రోజుల్లోనే మళ్లీ సొంత గూటికి చేరిన తెల్లం వెంకట్రావును భద్రాచలం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వైఎస్సాఆర్‌సీపీలో పనిచేశారు.
పొంగులేటి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలుపొందగా.. తెల్లం వెంకట్రావు మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత పొంగులేటితో కలిసి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు .2018 ఎన్నికల్లో భద్రాచలం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తెల్లం.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత కూడా ఆయన భద్రాచలం బీఆర్‌ఎస్ ఇంఛార్జ్‌గా కొనసాగారు. అయితే పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేక గళం వినిపించి పార్టీకి దూరమవ్వగా... తెల్లంగా కూడా గూలాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటితో కలిసి హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల రోజులకే ఈనెల 17న మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన దాదాపు మూడ్రోజులకే ఆయన బీఆర్ఎస్ పార్టీ తిరిగి టికెట్ ఇచ్చింది.
Aug 22 2023, 17:33