కేటీఆర్ సోపతికి ఎమ్మెల్యే టికెట్ !
- ఎమ్మెల్యే రేఖ నాయక్ గుస్సా
- కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రేఖ నాయక్
- జాన్సన్ నాయక్ కు టికెట్ ఖరారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. మెుత్తం 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. పెద్దగామార్పులు చేర్పులు లేకుండా దాదాపు సిట్టింగ్‌లందరికీ టికెట్లు కేటాయించారు.
ఈ విడతలో ఎనిమిది స్థానాల్లో కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మంత్రి కేటీఆర్ క్లాస్‌మేట్‌కు ఎమ్మెల్యే టికెట్ లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లను మార్చగా.. ఖానాపూర్ నియోజవర్గం నుంచి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు అవకాశం కల్పించారు.జాన్సన్ మంత్రి కేటీఆర్‌కు స్నేహితుడు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్ తండాకు చెందిన భూక్య జాన్సన్ నాయక్. నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యునివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమో పూర్తి చేశారు.
కొంత కాలం పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రస్తుత ఐటీ మంత్రి కేటీఆర్ జాన్సన్ ఇద్దరు క్లాస్‌మేట్స్. దీంతో ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. గతంలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. జాన్సన్ తాను చిన్నప్పటి నుంచి స్నేహితులమని చెప్పారు. ఒకరిపై ఒకరం ఎంతో నమ్మకంగా ఉంటామని.. తనకు సమస్య వచ్చినప్పుడు నేను, నాకు సమస్య వచ్చినప్పుడు జాన్సన్ అన్నివిధాలుగా సహకరించేవాడని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్‌ను మారుస్తున్నారన్న ప్రచారం జరగ్గాన్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు టికెట్ కన్ఫార్మ్ అనే టాక్ వినిపించింది. అందరూ ఊహించినట్లుగానే జాన్సన్‌కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. దీంతో అతడు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కాంగ్రెస్ గూటికి రేఖా నాయక్
ఇక పార్టీ టికెట్ కేటాయించకపోవటంతో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.
రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్.. టికెట్లు ప్రకటించిన కాసేపటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేఖా నాయక్ ఇవాళ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఖానాపూర్ నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
Aug 22 2023, 12:33