మాణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి
మాణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి...దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి
.ఐ.ఎఫ్.టి.యూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంగరాల నర్సింహా,బొమ్మిడి నగేష్ డిమాండ్
మైనారిటీ మతస్తులు మనుషులేననే కనీస ఆలోచన లేకుండా మణిపూర్ లో, మైనారిటీ ఆదివాసీ ప్రజలపై ముఖ్యంగా,కుకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి,ఊరేగించడం,అడ్డుగా వచ్చిన తండ్రి, తమ్ముడిని చంపేయడం,మహిళలను హత్యలు చేయడం హేయమైన చర్యని ఈ ఘటనను భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) తీవ్రంగా ఖండిస్తుందని,ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అమానుషమైన దుర్మార్గానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఐ.ఎఫ్.టి.యూ నల్లగొండ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బొంగరాల నర్సింహా,బొమ్మిడి నగేష్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం నల్లగొండ పట్టణంలోని CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం శ్రామిక భవన్ లో ఐ.ఎఫ్.టి.యూ జనరల్ బాడీ సమావేశం జరిగింది.. ఈసందర్భంగా వారు పాల్గొని
మాట్లాడుతూ...ఈ ఘటన మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కదిలించిందని,మనో వేదనకు గురిచేసిందని,ప్రధాని మోడీకి మాత్రం కనీస బాధ గానీ,చలనం గానీ లేకుండా మొద్దు నిద్రలో ఉందిని,మౌనాన్ని ప్రదర్శిస్తున్నారని, ఈ మౌనమే దేశానికి ప్రమాదమని అన్నారు.
సర్వ మతాలకు అనుకూలంగా రాజ్యాంగంలో అవకాశం ఉన్నప్పటికీ,హిందూ మతం పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ దాడులు చేయడం సమాజానికి మంచిది కాదని అన్నారు,సర్వ మతాలకు నిలయం ఈ దేశమని మరిచిపోయిన, ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ ఇతర మతోన్మాద శక్తులు, మైనారిటీ ప్రజలపై దాడులు, మారణకాండ ను కొనసాగించడం దుర్మార్గపు ఆలోచన అని అన్నారు. భారత్ మాత గురించి నిత్యం మాట్లాడుతున్న వీళ్ళు భారతీయ మహిళలను మరీ ముఖ్యంగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న అడవి బిడ్డలైన ఆదివాసీ మహిళలను వివస్త్రలను చేసి,ఊరేగించడం అనాగరిక సమాజంలో కూడా జరగలేదని,ఇంత అన్యాయానికి పాల్పడడం దారుణమని అన్నారు.
మనుషులను,మైనారిటీ లను చంపి,మానవతా విలువలను మంటగలుపుతున్న హిందూ మనుధర్మ శాస్త్ర,మతోన్మాద శక్తుల సమాజ తిరోగమన విధానాలను అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా త్రిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విచారణ చేపట్టకపోగా మౌనంగా ఉండడం అల్లరి మూకలకు కొమ్ముకాయడమేనని అన్నారు.వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యూ నాయకులు కత్తుల చంద్రశేఖర్,రావుల వీరేశ్,దాసరి నర్సింహా,కల్లూరు అయోధ్య, జానపాటి శంకర్, అంజి,టోపి రాజు,అశోక్, స్వామి,ముత్తు,గౌస్,అంబెడ్కర్,చౌగోని నాగరాజు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Aug 16 2023, 21:31