బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో హ్యాట్రిక్ ఖాయం : మంత్రి హరీశ్‌రావు
నల్గగొండ జిల్లా:జులై 26
మిర్యాలగూడ నియోజకవర్గంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ సమస్య తెలంగాణ లో లేదని..కాంగ్రెస్ పార్టీలోనే పదవుల నిరుద్యోగం ఉందని మంత్రి హారీష్ రావు ఆరోపించారు.
సీఎం కేసీఆర్ పాలనలో యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవని జడ్చర్ల సభలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్, బీజేపీ లు ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని.. అభివృద్ధి అనే ఆయుధంతో మేం వారికి సమాధానం చెబుతామన్నారు.
కాంగ్రెస్ పరిపాలన బాగోలేదనే ప్రజలు కేసీఆర్‌ను రెండు సార్లు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని రాష్ట్రంలో మూడోసారి ముమ్మాటికి బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకే ఈ ఘనతను సాధించిందని ఆయన తెలిపారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 వేల బెడ్స్ ఉండేవని… వాటి సంఖ్యను 50 వేలకు పెంచామని హరీశ్ వెల్లడించారు.
గత ఐదేళ్లలో లక్ష 50 వేల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని హరీశ్ అన్నారు.
నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట అని. అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు...
Jul 26 2023, 21:38