High Courts: హైకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారంలో.. ఇప్పటికే 7 చోట్ల అందుబాటులో!
దిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు హైకోర్టుల్లో (High Court) కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ వ్యవహారాలు సంబంధిత హైకోర్టు పాలనా పరమైన అంశాల్లోకే వస్తాయని..
అందులో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర ఏమీ ఉండదని తెలిపింది. కోర్టు వ్యవహారాలు ఆన్‌లైన్‌లో (Live Streaming) కొనసాగడం ఎంత అవసరమో కరోనా మహమ్మారి సమయంలో అర్థమయ్యిందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ ఈ సమాధానమిచ్చింది. '2023 జులై 17 నాటికి గుజరాత్, గువాహటి, ఒడిశా, కర్ణాటక, ఝార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్ మొదలైంది. మీడియాతోపాటు ఇతర ఔత్సాహిక వ్యక్తులు వీటిని వీక్షించవచ్చు' అని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది..
న్యాయస్థానాల్లో మరింత పారదర్శకత తీసుకురావడంలో భాగంగా కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని 'స్వప్నిల్ త్రిపాఠీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసు సందర్భంగా భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) సూచించింది.
ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన కోసం సుప్రీం కోర్టు ఈ-కమిటీ ఛైర్‌పర్సన్ ఆధ్వర్యంలో ఓ సబ్ కమిటీ ఏర్పాటయ్యింది. అనంతరం కమిటీ రూపొందించిన నిబంధనలను అమలు చేయాలని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు సుప్రీం కోర్టులోనూ గత సెప్టెంబరు 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే..
Jul 26 2023, 20:56