పిల్లలూ! స్కూల్ టైమింగ్ మారింది
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్ల టైమింగ్‌లో మార్పులు చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై.. ప్రాథమిక పాఠశాలలు అనగా 1వ తరగతి నుంచి 5 వరకు (1st Class To 5th Class) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంట వరకూ స్కూళ్లు ఉంటాయి. అప్పర్ ప్రైమరీ (ప్రాథమికోన్నత పాఠశాలలు) అనగా 6వ తరగతి నుంచి 10 వరకు (6 to 10th Class) స్కూళ్లు 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని ప్రైమరీ స్కూళ్లు కూడా ఇదే సమయాన్ని పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
తక్షణమే అమలు..!
కాగా.. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఈ టైమింగ్స్ పాటించాలని కేసీఆర్ సర్కార్ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ సోమవారం రాత్రే పంపించింది.
మరోవైపు.. డీఈవోలు, ఆర్‌జేడీఎస్ఈల పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే.. మంగళవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయన్న మాట.
ఇదివరకు ఇలా..!
అయితే ఇప్పటి వరకూ తెలంగాణలోని స్కూళ్లు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నడిచేవి. తాజాగా మారిన టైమింగ్స్ ప్రకారం ప్రైమరి స్కూళ్లకు ఉదయం అరగంట ఆలస్యంగా స్కూళ్లు మొదలై సాయంత్రం పావు గంట ఆలస్యంగానే ముగియనున్నాయి. ఇక అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఉదయం అరగంట ఆలస్యంగా ప్రారంభమై.. సాయంత్రం 45 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలలు ముగియనున్నాయి. కాగా.. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు, చేర్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే....
Jul 25 2023, 11:04