మణిపూర్ దారుణంపై ఐఏఎస్ స్మిత సబర్వాల్ స్పందన
మణిపూర్ లో మే 4న చోటుచేసుకున్న దారుణంపై యావత్ దేశం స్పందిస్తోంది. ఓ తెగకు చెందిన మహిళలను వివస్త్రలుగా మార్చి వీధుల్లో ఊరేగించడంపై జనం మండిపడుతున్నారు. పార్లమెంట్ కూడా రెండు రోజులుగా దద్దరిల్లుతోంది.
ఈ ఘటనపై తాజాగా తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ స్పందించారు. ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా మీడియా వెలుగులోకి తీసుకురావడంలేదేమని ప్రశ్నించారు.
చరిత్రలో ఎప్పుడు ఎలాంటి కలహాలు జరిగినా సరే అందులో మహిళలనే అవమానిస్తున్నారని స్మిత సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టి దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
మణిపూర్ లో అమాయక మహిళలను వివస్త్రలుగా మార్చి వేల మంది ముందు నిలబెడితే దాదాపు 70 రోజుల తర్వాత కానీ బయటకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణం మన మూలాలను కదిలిస్తోందని, అక్కడి మీడియా ఏంచేస్తోందని ప్రశ్నించారు.
మణిపూర్ తగలబడిపోతుంటే, దారుణాలు జరుగుతుంటే ప్రపంచం దృష్టికి తీసుకురాకుండా ఏంచేస్తోందని మీడియాను నిలదీశారు. రాజ్యాంగపరంగా తమకున్న విశేష అధికారాలను ఉపయోగించి మణిపూర్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలంటూ స్మిత సబర్వాల్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ను ట్యాగ్ చేస్తూ స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు. నైతికత లేని మెజారిటీ మనోభావాలు మన నాగరికతను నాశనం చేసేలా ఉన్నాయని స్మిత సబర్వాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Jul 23 2023, 12:04