Naveen Patnaik: చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్.. జ్యోతిబసు రికార్డు బద్దలు..
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు (Record) సృష్టించారు..
ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును (Jyothi Basu) ఆయన వెనక్కి నెట్టారు. ఈ జాబితాలో తొలి స్థానంలో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ (Pawan Kumar Chamling) ఉన్నారు.
ఇప్పటివరకు దేశంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉంది. ఆయన 1994 డిసెంబర్12 నుంచి 2019 మే 27 వరకు 24 ఏళ్లకు పైగా సీఎం పదవిలో సేవలు అందజేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ (BJD) విజయం సాధించి నవీన్ పట్నాయక్ మరోసారి సీఎం అయితే అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు..
కాగా ప్రస్తుతం ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదోసారి నవీన్ పట్నాయక్ సేవలు అందిస్తున్నారు. 1997లో తండ్రి బీజూ పట్నాయక్ మరణించడంతో ఆయన వారసుడిగా నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన తండ్రి పేరుతో బీజూ జనతా దళ్ (బీజేడీ)ని ఏర్పాటు చేసి 1997 నుంచి ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అదే ఏడాది ఎంపీగా విజయం సాధించారు. 1998 నుంచి 2000 వరకు కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా 2000 మార్చి 5న తొలిసారి ఆయన సీఎం పదవిని చేపట్టారు. 23 ఏళ్ల 138 రోజులుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు..
Jul 22 2023, 19:51