మణిపూర్ ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ :జులై 21
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది.
ఉదయం 11 గంటలు లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో లోక్ సభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. తిరిగి లోక్ సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతిచకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజంగానే తీవ్రంగా పరిగణించి ఉంటే.. తొలుత ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను బర్తరఫ్ చేసి ఉండేవారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
పార్లమెంట్ వెలుపల ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులుగా మణిపూర్ సీఎంను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు....
Jul 21 2023, 16:36