ఉగ్రరూపం.. దాల్చిన భద్రాద్రి గోదారి భయాందోళనలో ప్రజలు
భద్రాచలం:జులై 21
భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉపనదులు పొంగి వరద నీరు భారీగా వచ్చి గోదావరిలో చేరుతుంది.
దీంతో గురువారం ఉదయం 6 గంటలకు 38.50 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం 3.19 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. రాత్రి 8 గంటలకు 44.10 అడుగులకు పెరిగిన గోదావరి శుక్రవారం నాటికి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు చేరుకుంది. రామాలయం అన్నదాన సత్రంతో పాటు విస్తా కాంప్లెక్స్, రామాలయం పడమర మెట్లు వద్దకు బారీగా వరద నీరు వచ్చి చేరింది.
క్రమంగా పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతాలను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోదావరి ఉధృతి పెరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
అత్యవసర సేవలకు కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని చెప్పారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గోదావరి వరద ఉధృతి పరిశీలించి ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భద్రాద్రి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.....
Jul 21 2023, 13:32