11 పార్టీలే మిగిలాయ్.. ఏ గ్రూపులోనూ చేరని ఎంపీలు 91 మంది..
•వైకాపా, తెదేపా, భారాస, బిజూ జనతాదళ్ తటస్థంఎన్డీయే, ఇండియాల్లో 65 పార్టీలు
దిల్లీ: దేశంలో రాజకీయ పునరేకీరణలో భాగంగా ఎన్డీయే, ఇండియా కూటముల్లో పార్టీలు భారీగా చేరాయి..
ఈ రెండు కూటముల్లో ప్రస్తుతం 65 పార్టీలున్నాయి. అయితే 91 మంది ఎంపీలున్న 11 పార్టీలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నాయి. ఇందులో ఏపీలోని వైకాపా, తెదేపా, తెలంగాణలోని భారాస, ఒడిశాలోని బిజూ జనతాదళ్ ప్రధానమైనవి. ఈ 3 రాష్ట్రాల్లో 63 ఎంపీ సీట్లున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలున్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది..
ఏ కూటమిలోనూ లేని పార్టీలు
వైకాపా, భారాస, బిజూ జనతాదళ్, బీఎస్పీ, మజ్లిస్, తెదేపా, శిరోమణి ఆకాలీదళ్, ఏఐయూడీఎఫ్, జనతాదళ్ (ఎస్), ఆర్‌ఎల్‌పీ, శిరోమణి అకాలీదళ్ (మాన్).
వైకాపా, బిజూ జనతాదళ్ తరచూ పార్లమెంటులో భాజపాకు అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి.
తెలంగాణలోని భారాస ఈ ఏడాది మొదట్లో భాజపాకు వ్యతిరేక కూటమి కట్టాలని ప్రయత్నించింది. కానీ ప్రస్తుతం రెండు కూటములకూ దూరంగానే ఉంది.
రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోపిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యతిరేక గళమెత్తాలని తమ ఎంపీలకు ఆయన సూచించారు.తమను అంటరాని పార్టీగా చూస్తున్నారని ఆరోపిస్తూ మజ్లిస్ అధినేత ఒవైసీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు. ఈ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, కర్ణాటకల్లో ప్రభావం చూసే అవకాశముంది..
Jul 20 2023, 10:19