INDIA: 'ఇండియా' కూటమి తొలి భేటీకి ముహూర్తం ఖరారు
దిల్లీ: కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA)పై ఉమ్మడి పోరుకు జట్టు కట్టిన ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (INDIA- ఇండియా) అనే పేరును ప్రకటించాయి..
ఈ క్రమంలో ఇండియా కూటమి తొలి సమావేశం గురువారం జరగనుందని తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఛాంబర్‌లో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశం కానున్నారు.
గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు.
ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై సమన్వయంతో వ్యవహరించాలని రెండు రోజులపాటు బెంగళూరులో జరిగిన భేటీలో ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ క్రమంలో మరోసారి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. 26 పార్టీల ఇండియా కూటమికి లోక్‌సభలో 150 మంది సభ్యులు ఉండగా, ఎన్డీయేకు 330 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనుండటంతో ఈ విడత పార్లమెంటు సమావేశాలు ఆసక్తిగా కొనసాగే అవకాశముంది..
Jul 20 2023, 09:19