PUBG Love: సీమా హైదర్‌కు పాక్ సైన్యంతో సంబంధాలు!
దిల్లీ: పబ్జీ ఆడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) యువకుడు సచిన్ మీనాను ప్రేమించి వీసా లేకుండా నలుగురు పిల్లలతో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కేసులో మరికొన్ని విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి..
ఆమెకు పాకిస్థాన్ సైన్యంతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీమా భర్త గులామ్ హైదర్ ఓ భారతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సీమా హైదర్ సోదరుడు ఆసిఫ్ పాకిస్థాన్ సైన్యంలో చేరాడని, ఆమె బంధువు పాక్ సైన్యంలో ఉన్నతస్థాయి అధికారిగా ఉన్నట్లు తెలిపాడు.
సీమా సోదరుడు కరాచీలో పనిచేస్తున్న సమయంలో అతణ్ని కలుసుకున్నట్లు గులామ్ తెలిపాడు. అయితే, అతడు ప్రస్తుతం పాక్ సైన్యంలో పనిచేస్తున్నాడా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పాడు. అలాగే, ఆమె బంధువు ఇస్లామాబాద్‌లోని పాక్ సైనిక కార్యాలయంలో పనిచేస్తున్నట్లు గులామ్ తెలిపాడు..
గత రెండు రోజులుగా సీమా హైదర్‌తోపాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్ మీనా, అతడి తండ్రిని యూపీ ఏటీఎస్ అధికారులతోపాటు, ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
ఆమెకు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సీమా పేరిట ఉన్న పాకిస్థాన్ గుర్తింపు కార్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటితోపాటు ఆమె పాస్‌పోర్ట్, ఇతర ధ్రువపత్రాలు, పిల్లల వివరాలకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు..
Jul 19 2023, 12:55