కేసీఆర్, కేటీఆర్‌కు కాంగ్రెస్ సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. వలిగొండ టూ బీబీనగర్ 6కిలో మీటర్ల మేర మూసీ వెంట ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా పాదయాత్ర చేయనున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లనుంది.
ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం కాకముందే చెప్పిన కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు కాలయాపన చేశారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని నిప్పులు చెరిగారు.
డిపిఆర్ కూడా మొదలు కానీ ప్రాజెక్టులో కమీషన్ల కోసమని జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు ఎన్ జి టి మొట్టికాయలు వేస్తేనే నాలుగు ఎస్టీపీలు పెట్టారన్నారు. గంట సేపు మూసీలో నిలబడి కేసీఆర్, కేటీఆర్ ఒక గ్లాసు నీళ్లు తాగాలని సవాల్ విసిరారు. రేపు జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని తెలిపారు.
ప్రతిపక్షాలకు వాస్తవాలు తెలిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీకి వస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి లక్షల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు. మూసి ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు.. పది నెలల కాంగ్రెస్ పాలనను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nov 07 2024, 14:22