హైదరాబాద్ లో బయటపడ్డ భారీ మోసం
ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలు కంపెనీలు డబ్బులు తీసుకుని బోర్డులు తిప్పేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం మాదాపూర్ లోని ఓ సాఫ్టే వేర్ కోచింగ్ కం సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అంతకు ముందు కూడా ఓ కంపెనీ ఇలానే చేసింది. తాజాగా విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగాలంటూ పలువురిని మోసం చేసిన నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు సంబంధించి వివరాలను సీఐడీ హెడ్ శిఖా గోయల్ వెల్లడించారు.
హైదరాబాద్బాచుపల్లి, కూకట్ పల్లి కి చెందిన చీకటి నవ్యశ్రీ, సునీల్ కుమార్ కేపీహెచ్ బీలో ఓ కన్సల్టెన్సీని ప్రారంభించారు. అబ్రాడ్ స్టడీ ప్లాన్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కొట్టు సాయిరవి తేజ, కొట్టు సాయి మనోజ్, శుభం, వంశీ సహా మరికొంత మందితో కలిసి విజయవాడ, ఢిల్లీలో కన్సల్టెన్సీలు ప్రారంభించారు. విదేశాల్లో చదువుతో పాటు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు. చాలా మందిని నమ్మించారు.
ఇది నమ్మిన తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా కన్సల్టెన్సీలో డబ్బులు కట్టారు. ఒక్కొక్కరు నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత డబ్బులిచ్చిన వారిని విదేశాలకు పంపేవారు. విదేశాలకు వెళ్లగానే.. అక్కడ ఉద్యోగం లేక ఇబ్బంది పడ్డారు. తీవ్ర ఇబ్బందులు పడి తిరిగి ఇండియాకు వచ్చారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో మోసం విషయం వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్‌కు చెందిన సీహెచ్ కమలాకర్, అతని స్నేహితుడు అబ్రాడ్ స్టడీ ప్లాన్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ లో రూ.8 లక్షలు కట్టారు. కన్సల్టెన్సీ వీరిందరిని ఫేక్ డాక్యుమెంట్స్‌తో మల్టాకు పంపించింది. వీరికి అక్కడ ఎలాంటి ఉద్యోగం లేదని తెలిసింది. దీంతో వారు ఇండియా నుంచి డబ్బులు తెప్పించుకుని తిరిగి వచ్చారు. దీనిపై ఈ సంవత్సరం మార్చి 14న కరీంనగర్ వన్టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును సీఐడీలోని ఎకానిక్ అఫెన్సెస్ వింగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కన్సల్టెన్సీ పై నిర్మల్ జిల్లా ఖానాపూర్, కేపీ హెచ్ బీలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో సీఐడీ పోలీసులు నిందితులు సునీల్‌కుమార్, చీకటి నవ్యశ్రీలను అరెస్ట్ చేశారు.
Nov 07 2024, 14:11