నోబెల్ అవార్డు గ్రహీత సారథ్యంలో కొత్త ప్రభుత్వం
పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు. ఇది తాత్కాలికమే.
బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.
సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకానికి చెందిన భారత ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.
దీని తరువాత బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సైన్యాధికారులతో భేటీ అయ్యారు. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్, జమాతె ఇస్లామీ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు.
జైలు శిక్షను అనుభవిస్తోన్న మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆమెను విడుదల చేయాలంటూ ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు మరింత ముదరకముందే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తీర్మానించారు
2018 నుంచీ ఖలీదా జియా కారాగార శిక్షను అనుభవిస్తోన్నారు. ఆమెకు 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది అక్కడి కోర్టు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంటోన్నారు. అక్కడే సైనిక నిర్బంధంలో కొనసాగుతున్నారు. ఆమెను వెంటనే విడుదల చేయాలంటూ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.
అదే సమయంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనుస్ నియమితులు కానున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
1940 జూన్ 28వ తేదీన చిట్టగాంగ్‌లో జన్మించారు యూనస్. ఆర్థికశాస్త్రంలో 2006లో నోబెల్ అవార్డును అందుకున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలోపేతం చేశారాయన. మైక్రోక్రెడిట్, మైక్రోఫైనాన్స్ రంగంపై ఆయనకు గట్టిపట్టు ఉంది. బ్యాంకింగ్ సేవలను గ్రామణీ ప్రాంతాలకు విస్తరింపజేయడంలో కీలకంగా వ్యవహరించారు.
2009లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, 2010లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌తో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యకలాపాలను చేపట్టడానికి 2011లో యూనస్ సోషల్ బిజినెస్- గ్లోబల్ ఇనిషియేటివ్స్‌ను స్థాపించారు.
ఢాకా విశ్వవిద్యాలయంలో చదివారు. 1969లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. డాక్టరేట్ అందుకున్నారు. వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో చదువుకోడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను సైతం పొందారాయన. విద్యాభ్యాసం ముగిసి తరువాత మిడిల్ టేన్నెస్సీ స్టేట్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. చిట్టాగాంగ్ యూనివర్శిటీ ఎకనమిక్స్ హెడ్‌గా అపాయింట్ అయ్యారు.
Aug 07 2024, 12:26