ఇసుక మేటరేంటి..?
ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రక్ సర్వే చేయించాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రక్ సర్వే చేయించాలని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. బ్యారేజీకి ఎగువన 365 రోజుల పాటు నీరు నిల్వ ఉంటుంది. ఇక్కడ 3.07 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 12 అడుగులు. వరదలు వచ్చినప్పుడు ఇన్‌ఫ్లో లెక్కలను బట్టి గేట్లను పైకి ఎత్తుతారు. బ్యారేజీకి రెండు విధాలుగా వరదలు వస్తుంటాయి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినప్పుడు ఆ నీరు పులిచింతలకు చేరుతుంది. పులిచింతల పూర్తిగా నిండాక ఎగువ నుంచి నీరు విడుదల చేస్తారు. తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా కీసర, పాలేరు, వైరా, కట్టలేరు వంటి వాగుల ద్వారా వరద నీరు వస్తోంది. బ్యారేజీలో నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఇలా ఎగువ నుంచి వస్తున్న నీటితో పాటు చెత్తాచెదారం కొట్టుకు వస్తుంది. ఇందులో కొంతభాగం గేట్లు ఎత్తినప్పుడు నీటిలో దిగువకు వెళ్లిపోతుంది. చాలావరకు చెత్తాచెదారం బ్యారేజీ గేట్ల వెనుక భాగాన ఉండిపోతుంది. ఇదంతా సిల్టుగా మారుతుంది
బ్యారేజీ వద్ద బ్యాథిమెట్రిక్ సర్వే నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021వ సంవత్సరంలో గుంటూరు జిల్లా వెంకటాయపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు బ్యాథిమెట్రిక్ సర్వే నిర్వహించారు. బ్యారేజీ వద్ద 1.8 లక్షల మెట్రిక్ టన్నుల సిల్టు ఉన్నట్టు గుర్తించారు. ఇలా సిల్టు తీసినప్పుడు ఇసుక బయటకు వస్తుంది.
ఈ ఇసుకకు మంచి డిమాండ్ ఉంటుంది. నదిలో నుంచి తీస్తున్న ఇసుక కంటే ఈ ఇసుకలో పటిష్టత ఎక్కువగా ఉంటుందని భవన నిర్మాణ ఇంజనీర్లు చెబుతున్నారు. అందుకే సిల్టు ద్వారా వచ్చిన ఇసుకకు అధిక ధర ఉంటుంది. ఇలా తీసిన ఇసుకను ముందుగా జలవనరుల శాఖ ఉపయోగించుకుంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాలకు ఈ ఇసుకను ఉపయోగిస్తారు. ఇంకా మిగిలిన ఇసుకను భూగర్భ గనుల శాఖకు అప్పగిస్తారు.
2021 తర్వాత ప్రకాశం బ్యారేజీకి వరదలు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో బ్యాథిమెట్రిక్ సర్వే చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ సర్వే చేయడానికి మెరైన్ ఇంజనీరింగ్ సంస్థలను టెండర్లకు ఆహ్వానించాలి. ఆ సంస్థలు సర్వే చేసి ఇసుక, సిల్టు అంచనాలను నివేదిక రూపంలో ఇవ్వడానికి రూ.40 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుతం ఉచిత ఇసుక వ్యవహారాలను భూగర్భ గనుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నందున బ్యాథిమెట్రిక్ సర్వేకు అవసరమైన నిధులను ఇవ్వాలని భూగర్భ గనుల శాఖ అధికారులకు జలవనరుల శాఖ అధికారులు లేఖ రాశారు. ఇలా నిధులను ఇచ్చే అధికారం తమకు లేదని చెప్పిన భూగర్భ గనుల శాఖ అధికారులు ఆ ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపారు.
టలు వేసిన ఇసుకను గుర్తించడానికి ఈ బ్యాథిమెట్రిక్ సర్వేను నిర్వహిస్తారు. దీన్నే హైడ్రోగ్రాఫిక్ సర్వే అని వ్యవహరిస్తారు. నదీగర్భంలో నేల ఏ ఆకారంలో ఉంది. ఎక్కడెక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఇసుకను అక్కడ తవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న అంశాలను ఈ సర్వేలో తెలుసుకుంటారు.
ఈ సర్వే చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన బోటు ఉంటుంది. దానిద్వారా మాత్రమే ఈ సర్వేను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. బోటుకు సెన్సార్, జీపీఎస్ సిస్టమ్ ఉంటాయి. ఏడీసీపీ (అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్స్) ద్వారా నీటి ప్రవాహాన్ని తెలుసుకుంటారు. అలల తీవ్రతను ఈ ఏడీసీపీ తెలియజేస్తుంది.
Aug 06 2024, 13:28