వరద వదిలేసి.. ఉన్న నీళ్లు ఒడగొట్టి!.. మేడిగడ్డ నుంచి వృథాగా పోతున్న గోదావరి జలాలు
భవిష్యత్తు అవసరాలకు నిల్వ ఉంచుకోవాల్సి న నీటిని ఒడగొట్టి.. ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. వందలాది టీఎంసీల వరదను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సముద్రానికి వదిలేస్తున్నది. మొండికి పోయి కన్నెపల్లి పంప్‌హౌస్‌లను నడుపకుండా ఎగువ ప్రాజెక్టులను, వాటి కింద ఆయకట్టును ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నది.
ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటానికి దిగొచ్చిన సర్కార్, ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.4247 టీఎంసీల నీరే నిల్వ ఉన్నది. ఈ నీటిని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌస్ నుంచి ఏడు మోటర్ల ద్వారా ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా నాలుగైదు మోటర్లతోనే సరిపెడుతున్నది.
ఒక్కో మోటర్ సామ ర్థ్యం 3,150 క్యూసెక్కులు కాగా, ఈ లెక్కన ఏడు పంపుల ద్వారా రోజుకు 22,050 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపుహౌస్‌కు ఎత్తిపోయవచ్చు. అక్కడి నుంచి ఏడు బాహుబలి మోటర్ల ద్వారా రోజుకు 22,050 క్యూసెక్కుల నీటిని మధ్యమానేరుకు ఎత్తిపోయవచ్చు.
అంటే దాదాపు రోజుకు రెండు టీఎంసీల నీటిని సులువుగా ఎత్తిపోసుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతానికి ఎల్లంపల్లిలో నీళ్లు అందుబాటులో ఉన్నా మొత్తం మోటర్లు ఆన్ చేయకుండా ప్రభుత్వం నాలుగైదు మోటర్లే నడుపుతున్నది. వరద ఉన్నప్పుడే ఎత్తిపోసుకునే అవకాశాన్ని ‘చే’జేతులా జారవిడుస్తున్నది.
అడుగడుగునా అలసత్వం
కాళేశ్వరం జలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. ఎగువన ప్రాజెక్టులు నీళ్లు లేక బోసిపోతుండగా వాటి పరిధిలో భూగర్భ జలాలు అడుగంటి నీరందక నార్లు ముదురుతున్నాయి. మరోవైపు రోజుకు 70 టీఎంసీల నీళ్లు లక్ష్మీ బరాజ్ మీదుగా సముద్రం పాలవుతున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రాజెక్టుల్లోకి నీరు వస్తుందన్న ఉద్దేశంతో ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు, ఎల్‌ఎండీ నుంచి ఎస్సారెస్పీ వరకు రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేసుకున్నారు. మరికొన్ని చోట్ల నాట్లు వేసుకునేందుకు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి ఎత్తిపోసుకునేందుకు కావాల్సినన్ని కాళేశ్వరం జలాలున్నా వివిధ సాకులు చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా దాటవేస్తున్నది. కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంతో దిగొచ్చిన సర్కారు, ఈ నెల 27 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతల పక్రియ చేపట్టింది. ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశమున్నా పంపులు నడపడం లేదు.
ఎల్లంపల్లిలో నీరు తగ్గితే పరిస్థితేంటి?
నిజానికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో అంతంత మాత్రమే ఉంటుంది. ప్రాజెక్టులో వివిధ అవసరాల కోసం 10 నుంచి 12 టీఎంసీల దాకా నీటిని నిల్వ ఉంచాలి. ఇవి అయిపోతే ఎత్తిపోతలకు అందుబాటులో ఉండేనీటి శాతం తక్కువ అవుతుంది. ప్రస్తుత ఇన్‌ఫ్లోను బట్టి చూస్తే మరో మూడు నాలుగు రోజులకు మించి పంపులు నడిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో నీళ్లు తగ్గితే ప్రభు త్వం నీటి ఎత్తిపోతలకు మంగళంపాడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అదే జరిగితే లక్షలాది మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టవుతుంది. అందుకే బీఆర్‌ఎస్ స్పష్టమైన డిమాండ్ చేసింది. కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులు నింపడం అసాధ్యమనే విషయాన్ని సుస్పష్టం చేసింది. నార్లు ముదురుతున్న నేపథ్యంలో కాళేశ్వరం జలాల ఎత్తిపోతలకు డిమాండ్ పెరుగుతున్నది. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ద్వారా ఒక్కో టీఎంసీ చొప్పున కూడవెళ్లి, హల్దీ వాగుల్లోకి సాగునీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేశారు. లేదంటే ఆగస్టు 2న వేలాది మంది రైతులతో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
ఎగువన వెలవెల.. దిగువన వృథా
ప్రస్తుతం రాష్ట్రంలో మేడిగడ్డకు ఎగువన ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతుంటే అదే మేడిగడ్డ బరా జ్ నుంచి రోజుకు దాదాపు 70 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఈ సీజన్‌లో దాదాపు 700కు పైగా టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ముందుచూపుతో అధ్యయనం చేసి గోదావరి జలాల ఎత్తిపోతలకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, దానిద్వారా నీటిని తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా మొండిగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలను వదిలి ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుండగా తాడోపేడో తేల్చుకునేందుకు రైతాంగం సైతం సమాయత్తమవుతున్నది.
Aug 05 2024, 14:25