మెట్రో రైలుకు బ్రేక్‌మరో అడ్డంకి
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కేలాలేదు. వైసీపీ ప్రభుత్వం విశాఖలో మోనో రైలు నడుపుతామంటూ ప్రగల్భాలు పలికింది. అంతకు ముందు ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రివైజ్ చేసి పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరితే...నాలుగేళ్లు దానిని తొక్కి పెట్టి ఎన్నికల ముందు సమర్పించింది. దానిని పరిశీలించేలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది. తాజాగా రాజ్యసభలో ఓ ఎంపీ విశాఖపట్నం మెట్రో రైలు పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. దానికి దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. ప్రాజెక్టుకు రివైజ్డ్ డీపీఆర్ అయితే పంపించారు గానీ దానికి జత చేసిన కాంప్రెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)కి కాలదోషం పట్టిందని, కొత్తది పంపాల్సి ఉందని తేల్చి చెప్పింది.
ఏమిటీ మొబిలిటీ ప్లాన్?
విశాఖ నగరంలో జనాభా, ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు, రహదారుల సంఖ్య, వాటి విస్తీర్ణం, వాహనాల సంఖ్య, వార్షిక పెరుగుదల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా చేపట్టిన చర్యలు, మెట్రో రైలు ప్రాజెక్టుతో వాటికి అనుసంధానం ఎలా?...అనే వివరాలు సమర్పించేదే మొబిలిటి ప్లాన్
తెలుగుదేశం పార్టీ 2017లో విశాఖపట్నం మెట్రో రైలును ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2108లో అధ్యయనం చేసి మొబిలిటీ ప్లాన్ తయారుచేసింది. మొత్తం 42.54 కి.మీ. పొడవున ట్రాక్ నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి అప్పట్లో రూ.8,300 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా సమకూర్చాల్సిన రూ.4,200 కోట్లను దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని భావించారు. టెండర్లు పిలిచారు.
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,300 కోట్లకు చేరింది. మొబిలిటీ ప్లాన్ కాల పరిమితి ఐదేళ్లు. 2018లో రూపొందించినది కాబట్టి దాని గడువు 2023తో ముగిసిపోయింది. ఈ ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ పరిశీలనలో ఉన్నందున కొత్త మొబిలిటీ ప్లాన్ సమర్పించాలని కేంద్రం సూచించింది
ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. నగరంలో ట్రాఫిక్ సజావుగా సాగడానికి 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించగా జాతీయ రహదారుల సంస్థ వాటికి ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటికి టెండర్లను పిలిచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నందున, ఆ ఫ్లైఓవర్లు, మెట్రో రైలు స్షేషన్లను ఇంటిగ్రేట్ చేస్తూ కొత్త ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు మెట్రో రైలు అధికారులకు సూచించారు. ఫ్లైఓవర్ల నిర్మాణం మంచిదా?, ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే మంచిదా? ఆలోచించి తనకు చెప్పాలని కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇబ్బంది లేకుండా మార్పులు చేయాలని సూచించారు.
అంటే కేంద్రం కోరిన మొబిలిటీ ప్లాన్ కూడా ఇందులో కీలకం కానుంది. నగరంలో బీఆర్‌టీఎస్ రహదారులు, వాహనాల సంఖ్య, ఏయే జంక్షన్లలో ఎంతెంత ట్రాఫిక్ ఉంటున్నదీ కొత్తగా అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా మెట్రో రైళ్ల సంఖ్య, వాటికి బస్సుల అనుసంధానం వంటివి సమర్పించాల్సి ఉంది. ఇవన్నీ పరిశీలించాకే కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుంది. అప్పుడు పీపీపీలో చేయడానికి ఎవరు ముందుకు వస్తారనేది తేలుతుంది. ఆ తరువాతే ప్రాజెక్టు ముందుకు వెళుతుంది.
Aug 04 2024, 21:19